Rinku Singh : ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లతో హీరో అయిన రింకూ సింగ్ (Rinku Singh) ఇక వెనుదిరిగి చూడట్లేదు. టీమిండియా తరఫున కూడా ఫినిషర్‌గా చెలరేగిపోతున్నాడు. పొట్టి క్రికెట్ సంచలనంగా మారిన రింకూ ఎన్నో కష్టాలను దాటి ఈ స్థాయికి చేరాడు. పేదింటి బిడ్డగా ఎన్నో ఇబ్బందులు పడిన అతడు తన కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra)తో మాట్లాడుతూ.. ‘మా నాన్న నన్ను క్రికెట్ ఆడనిచ్చేవారు కాదు. క్రికెట్ ఆడానని తెలిస్తే చాలు బాగా కొట్టేవారు’ అని రింకూ చెప్పాడు. ‘మా నాన్న ఖాంచంద్ర సింగ్‌కు నేను క్రికెట్ ఆడడం నచ్చేది కాదు. అందుకని ఆయన నన్ను తరచూ కొట్టేవారు. బుద్దిగా చదువుకోవాలని లేదంటే తనతో పాటు పనికి రావాలని పదే పదే చెప్పేవారు.
ఆకాశ్ చోప్రాతో రింకూ మాటామంతీ
అయితే.. 2012లో నేను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాను. దాంతో, నాకు బహుమతిగా బైక్ లభించింది. ఆ రోజు నుంచి నాన్న నన్ను తిట్టడం ఆపేశారు. ఆయనకు నాపై నమ్మకం కలిగింది’ అని రింకూ తెలిపాడు. ఉత్తర ప్రదేశ్‌లోని గూపిగంజ్ రింకూ తండ్రి ఖాంచంద్ర సింగ్ స్వగ్రామం. వంటగ్యాస్ సిలిండర్ల కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. కొడుకు భారత జట్టుకు ఎంపికయ్యాక కూడా ఆయన తన వృత్తిని మానలేదు. ఇప్పటికీ రోజూ ఆటోలో ఇంటింటికి, హోటళ్లకు ఖాంచంద్ర సిలిండర్లు చేరవేస్తున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రింకూ ఆడిన తీరు అమోఘం. సంచలన ఇన్నింగ్స్‌తో ఈ చిచ్చరపిడుగు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఫినిషర్‌గా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరించిన రింకూ.. శ్రీలంక పర్యటనలో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. దాంతో, 18వ సీజన్లో కోల్‌కతా అతడిపై భారీ ఆశలే పెట్టుకుంది.
అయితే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ ఫ్రాంచైజీకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. ఒకవేళ తనను కోల్‌కతా వదిలేస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)కు ఆడుతానని రింకూ చెప్పాడు. పదహారో సీజన్లో శివాలెత్తిపోయిన రింకూ సింగ్‌కు 17వ సీజన్లో చాన్స్‌లే రాలేదు. నాలుగైదు ఇన్నింగ్స్‌లు ఆడినా మనపటిలా చెలరేగకపోయాడు. దాంతో, ఈసారి కోల్‌కతా అతడిని వదిలేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో, రింకూ కూడా కొత్త జట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.