అనంతపూర్: దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ ‘డీ’ జట్టు.. ఆఖరి రోజు 301 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్ రికీ భుయ్ (113) శతకంతో పోరాడగా శ్రేయస్ (41), సంజూ శాంసన్ (40) రాణించారు. కానీ ‘ఏ’ బౌలర్లలో తనుష్ కొటియాన్ (4/73), శామ్స్ ములానీ (3/117) శ్రేయస్ సేనను నిలువరించారు. ఈ గెలుపుతో ఏడు పాయింట్లు సాధించిన ‘ఏ’ జట్టు ఫైనల్ ఆశలను నిలుపుకుంది. కాగా వరుసగా రెండు ఓటములతో ‘డీ’ జట్టు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్టే!
ఇండియా ‘బీ’, ‘సీ’ మధ్య జరిగిన మ్యాచ్ పేలవమైన డ్రా గా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ‘సీ’ 525 పరుగుల భారీ స్కోరు చేయగా ‘బీ’ జట్టు 332 పరుగులకే ఆలౌట్ అయింది. ‘సీ’ బౌలర్ అన్షుల్ కంబోజ్ (8/69) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన ‘సీ’.. నాలుగో రోజు 128/4 పరుగులు చేసింది. దులీప్ ట్రోఫీలో మూడో దశ మ్యాచ్లు ఇదే వేదికపై ఈనెల 19 నుంచి మొదలవుతాయి.