Virat Kohli | ఢిల్లీ: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక బాట పట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ ఆశ్రమానికి సతీసమేతంగా వెళ్లాడు. అక్కడ సుమారు మూడు గంటలకు పైగా గడిపిన కోహ్లీ.. ప్రేమానంద్ చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నాడు. రిటైర్మెంట్ ప్రకటన అనంతరం కోహ్లీ పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదే కావడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలోనూ కోహ్లీ రెండు సార్లు బృందావన్ ధామ్‌కు రావడం గమనార్హం.
14 ఏండ్ల టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ఘనంగా ట్రిబ్యూట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్లో ఈనెల 17న ఆర్సీబీ.. చిన్నస్వామి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ఆడనుండగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు అభిమానులందరూ కోహ్లీ జెర్సీతో ఉన్న వైట్ డ్రెస్ కోడ్‌లో రానున్నారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని ఈ ప్రతిపాదన చేయగా అందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా మద్దతు పలికారు.
అద్భుతమైన టెస్టు మ్యాచ్ కెరీర్..ఈ దిగ్గజ క్రికెటర్ సొంతం. టేక్ ఏ బో విరాట్‌కోహ్లీ. ఆట పట్ల నీకున్న అంకితభావం, నీ అసమాన నాయకత్వ శైలిని మిస్సవుతున్నాం. క్రికెటర్‌గా నీవు అందించిన ఎన్నో చిరస్మరణీయ సందర్భాలు, వారసత్వానికి ధన్యవాదాలు. మిగతా ఫార్మాట్లలోనూ అదరగొడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలువాలని కోరుకుంటున్నాను.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్