ధర్మశాల దద్దరిల్లింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కురిపించిన పరుగుల వర్షంతో స్టేడియం తడిసిముద్దయింది. ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 నాటౌట్) సృష్టించిన విధ్వంసానికి గుజరాత్ టైటాన్స్ తల్లడిల్లింది. లీగ్ దశలో టాప్ లేపిన ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో మరింత నాటుకొట్టుడు ఆటతో అదరగొట్టింది. ఈ దశలో అత్యధిక స్కోరుతో చరిత్ర సృష్టించినబెంగళూరు ఆపై బంతితోనూ చెలరేగింది. క్వాలిఫయర్-1లో టైటాన్స్‌ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్ చేరుకుంది.
ధర్మశాల: ఐపీఎల్లో వరుసగా రెండోసారి కప్పు నెగ్గేందుకు ఆర్సీబీ అడుగు దూరంలో నిలిచింది.మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 92 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. ఈహై స్కోరింగ్ పోరులో తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 254/5 స్కోరు చేసింది. పాటిదార్‌కు తోడు విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) రాణించారు. అనంతరం జీటీ 19.3 ఓవర్లలో 162 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది. రాహుల్ తెవాటియా (68),జోస్ బట్లర్ (29) టాప్ స్కోరర్లు. జాకబ్ డఫీ మూడు, రసిఖ్ దార్, భువీ, కృనాల్ రెండేసి వికెట్లతోదెబ్బకొట్టారు. పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో చాన్స్ ఉంది. బుధవారం సన్‌రైజర్స్-రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గే జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.
బ్యాటర్లు విజృంభించిన పిచ్‌పై బౌలర్లూ సత్తా చాటడంతో ఆర్సీబీ విజయం తేలికైంది. భారీ ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. ఫామ్‌లో ఉన్న టాప్-3 బ్యాటర్లను పవర్ ప్లేలోనే కోల్పోయిన జీటీ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ సుదర్శన్ (14)ను దురదృష్టం వెంటాడించింది. మూడో బంతిని పాయింట్ దిశగా ఆడిన తర్వాత అతని చేతుల్లోంచి బ్యాట్ జారిపోయి వికెట్ల మీద పడటంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. కొత్త బాల్‌తో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్.. కెప్టెన్ గిల్ (2)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో జీటీ 27/2తో ఇబ్బందుల్లో పడింది.
తన బౌలింగ్‌లో వరుసగా 4,6,4 కొట్టిన బట్లర్‌ను తర్వాలి బాల్కే లెగ్ కట్టర్‌తో ఔట్ చేసిన హేజిల్‌వుడ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆరో ఓవర్లో నిశాంత్ సింధు (5)ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసిన రసిఖ్ దార్ వెంటనే కోహ్లీ క్యాచ్‌తో జేసన్ హోల్డర్ (0)నూ పెవిలియన్ చేర్చడంతో జీటీ 51/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. సుందర్ (8), రషీద్ ఖాన్ (8) ను డఫీ ఔట్ చేయగా.. రబాడ (9) కూడా నిరాశపరచడంతో గుజరాత్ వందలోపే ఆలౌటయ్యే లా కనిపించింది. కానీ, ఓ ఏండ్లో సిరాజ్ (5)ను నిలబెట్టి పోరాడిన ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ తెవాటియా అర్ధ శతకం పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 150 దాటించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుండి నడిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ ఆరంభం నుంచే పవర్ హిట్టింగ్తో అదరగొట్టింది. సిరాజ్ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19).. రబాడ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి వెంటనే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (30) తోడుగా కింగ్ కోహ్లీ జట్టుకు బలమైన పునాది వేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ైస్టెలిష్ లాఫ్టెడ్ షాట్‌తో కోహ్లీ ఫోర్ల ఖాతా తెరవగా.. రబాడ వేసిన నాలుగో ఓవర్లో పడిక్కల్ హ్యాట్రిక్ ఫోర్లు బాది స్కోరు 50 దాటించాడు. రబాడ బౌలింగ్‌లో కోహ్లీ 4,4,6 కొట్టడంతో పవర్‌ప్లేలోనే 76 రన్స్ వచ్చాయి. ఫీల్డింగ్ మారిన తర్వాత టైటాన్స్ బౌలింగ్ మెరుగైంది. పేసర్ హోల్డర్, స్పిన్నర్ రషీద్ వరుసగా నాలుగు ఓవర్ల్లు కట్టడి చేశారు. ఈ
క్రమంలో రెండు బంతుల తేడాతో కోహ్లీ, పడిక్కల్‌ను ఔట్ చేసిన హోల్డర్ ఆర్సీబీ స్పీడుకు బ్రేకులు వేశాడు. దాంతో సగం ఓవర్లకు 99/3తో నిలిచిన ఆ జట్టు 200 చేసినా మంచి స్కోరే అనిపించింది. కానీ, సెకండాఫ్‌లో రజత్ పాటిదార్ షో మొదలైంది. కృనాల్ పాండ్యా తోడుగా అతను భారీ షాట్లతో విజృంభించాడు. హోల్డర్ బౌలింగ్‌లోనే సిక్స్‌తో స్కోరు వంద దాటించాడు. ప్రసిధ్ వేసిన 14వ ఓవర్లో రజత్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడం గుజరాత్ పాలిట శాపంగా మారింది. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న ఆర్సీబీ కెప్టెన్ మరింత రెచ్చిపోయాడు. కుల్వంత్ వేసిన 15వ ఓవర్లో కృనాల్ రెండు ఫోర్లు కొడితే.. పాటిదార్ 4,6,4 దంచడంతో 28 రన్స్ లభించాయి.
అదే జోష్‌లో రషీద్ బౌలింగ్‌లో కృనాల్ ఓ సిక్స్, పాటిదార్ రెండు సిక్సర్లు రాబట్టారు. తర్వాతి ఓవర్లో కృనాల్‌ను హోల్డర్ ఔట్ చేసి 95 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించినా రజత్ అస్సలు తగ్గలేదు. వరుసగా రెండు సిక్సర్లతో 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. టిమ్ డేవిడ్ (4) నిరాశ పరిచినా.. చివర్లో జితేశ్ (15 నాటౌట్) తోడుగా రజత్ మరింత జోరు పెంచాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 6, 4.. ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లు కొట్టి స్కోరు 250 దాటించాడు. అతని ధాటికి ఆఖరి ఆరు ఓవర్లలోనే ఆర్సీబీ ఏకంగా 114 పరుగులు పిండుకోవడం గమనార్హం.
5 ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి . గతేడాది విజేతగా నిలిచిన ఆ టీమ్ 2009, 2011, 2016లో రన్నరప్‌గా నిలిచింది.
38 ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో బౌండరీలు. ఓ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధికం. 2012లో ఢిల్లీపై చెన్నై కొట్టిన 33 బౌండరీల రికార్డు బద్దలైంది.
254/4 ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్కోరు ఐపీఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్ దశలో అత్యధికం. 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233/3 స్కోరు రికార్డు బ్రేక్ అయింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 254/5 (పాటిదార్ 93*, కోహ్లీ 43, హోల్డర్ 2/39);
గుజరాత్: 19.3 ఓవర్లలో162 ఆలౌట్ (తెవాటియా 68, బట్లర్ 29, డఫీ 3/39, రసిఖ్ 2/24)