Ambati Rayudu : ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) నిరాశపరుస్తోంది. టాప్ ఆటగాళ్లతో పాటు మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni) మునపటిలా చెలరేగి ఆడకపోవడం సీఎస్కే విజయాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కామెంటరీ బాక్స్‌లో మహీ భాయ్ గురించి మాట్లాడిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో, నాలుక్కరచుకున్న రాయుడు దిద్దుబాటు చర్యలకు దిగాడు. తాను ధోనీకి వీరాభిమానిని అని.. సీఎస్కే ఈసారి కూడా ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నానని తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించాడీ సీఎస్కే మాజీ క్రికెటర్.
‘నేను గతంలో, ఇప్పుడు, ఇకముందు ధోనీకి అభిమానినే. ఎవరు ఏమనుకున్నా నేను తాలాకు పెద్ద ఫ్యాన్. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. కాబట్టి దయచేసి డబ్బులు ఖర్చుపెట్టి అనవసర ప్రచారం చేయకండి. ఆ డబ్బులను ఏదైనా ఛారిటీకి ఇవ్వండి. అలా చేస్తే ఎంతోమంది పేదలకు మేలు చేసిన వాళ్లవుతారు’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు రాయుడు.
I was a Thala’s fan
I am a Thala’s fan
I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.
So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.
— ATR (@RayuduAmbati) April 10, 2025
అసలేం జరిగిందంటే.. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే ఔటయ్యాక ధోనీ క్రీజులోకి వచ్చాడు. మామూలుగా అయితే.. 7వ స్థానంలో మైదానంలోకి వచ్చే తాలా.. జట్టును గెలిపించాలనే లక్ష్యంతో ముందుగానే క్రీజులోకి దిగాడు. ఆ సమయంలో కామెంటేటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మైక్ అందుకొని.. ‘వడివడిగా మెట్లు దిగి బ్యాటింగ్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. అతడి తీరు చూస్తుంటే పరుగుల వరద పారడం ఖాయం’ అని అన్నాడు.
కామెంటేటర్ అయిన అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘మీరు ధోనీ క్రికెట్ ఆడడానికి బదులు యుద్ధం చేసేందుకు మైదానంలోకి వస్తున్నాడు అన్నట్టుగా చెబుతున్నారు. నాకైతే ధోనీ చేతిలో బ్యాటు కాదు కత్తి పట్టుకొని వస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ రోజు అతడి కత్తి విధ్వంసం సృష్టిస్తుంది. ధోనీ నడక చూడండి. గత మ్యాచ్‌లో అతడు ప్రశాంతంగా క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అలాకాదు. వామప్ మ్యాచ్‌లో సైతం మోకాలికి వేసుకొనే నల్లని పట్టి కూడా తీసేసి ఆడాడు. ఈరోజు కచ్చితంగా మనమందరం ఎదురుదాడికి దిగే ధోనీని చూస్తాం’ అని జోష్‌గా చెప్పాడు. అయితే.. సిద్దూ కలగజేసుకొని.. ‘హలో గరూ ధోనీ క్రికెట్ ఆడేందుకు మాత్రమే వస్తున్నాడు. యుద్ధం చేయడానికి కాదు’ అని ఘాటుగా స్పందించాడు.