రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు.
ఇప్పటికే సామాన్యులకు ఉపాధి అవకాశాలు లేక, వస్తున్న కొద్దిపాటి వేతనాలు ఏమాత్రం సరిపోక జీవితాన్ని భారంగా గడుపుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను భరించలేని ఈ పరిస్థితుల్లో గ్యాస్ పై రూ.50 పెంచి పేదలపై భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తూ పేదలపై భారాలు మోపడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను, గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలందరితో కలిపి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ. సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, సీపీఎం నల్లగొండ పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, కోట్ల అశోక్‌రెడ్డి, గంజి నాగరాజు, గాదే నరసింహ, పాక లింగయ్య, గుండాల నరేశ్, పాలాది కార్తీక్, సలివోజు సైదాచారి, భూతం అరుణ, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, బొల్లు రవీంద్ర కుమార్, కునుకుంట్ల ఉమారాణి, సీత వెంకటయ్య, ఆవుల గిరి, కత్తుల యాదయ్య, జేరిపోతుల సైదులు పాల్గొన్నారు.