పాట్నా: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోయింది. నచ్చజెప్పిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించాడు. ఆ తర్వాత కుమార్తెను హత్య చేశాడు. (Man Kills Daughter) మృతదేహాన్ని బాత్రూమ్లో ఉంచి లాక్ చేశాడు. కూతురు గురించి భార్య అడగ్గా మళ్లీ పారిపోయిందని చెప్పాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల సాక్షి తన ప్రియుడితో కలిసి మార్చి 4న ఢిల్లీకి పారిపోయింది. మాజీ సైనికుడైన తండ్రి ముఖేష్ సింగ్ వారం రోజుల తర్వాత తన కుమార్తెకు నచ్చజెప్పాడు. సమస్తిపూర్‌కు ఆమెను రప్పించాడు.
కాగా, వేరే కులానికి చెందిన వ్యక్తితో కుమార్తె సాక్షి వెళ్లిపోవడంపై తండ్రి ముఖేష్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 7న ఆమెను హత్య చేశాడు. ఇంట్లోని బాత్రూమ్లో మృతదేహన్ని ఉంచి లాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడ్ని కూడా హత్య చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో అతడు గ్రామంలో లేకపోవడంతో బతికిపోయాడు.
మరోవైపు కుమార్తె సాక్షి కనిపించకపోవడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది. కూతురు గురించి భర్త ముఖేష్ సింగ్‌ను అడిగింది. అయితే సాక్షి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. కుమార్తె మిస్సింగ్‌పై అనుమానించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు.
కాగా, లాక్ చేసిన బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడాన్ని పోలీసులు గమనించారు. డోర్ తీసి చూడగా లోపల సాక్షి మృతదేహం కనిపించింది. దీంతో తండ్రి ముఖేష్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వేరే కులం వ్యక్తితో కుమార్తె పారిపోవడంపై ఆగ్రహంచి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు అతడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.