Ravindra Jadeja | దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 4వేల పరుగులు, 300 వికెట్లు తీసిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా టెస్ట్ రెండో రోజున జడేజా ఈ ఘనత సాధించాడు. కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు జడేజా. 88వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జడేజాకు 4వేల పరుగులు చేసేందుకు పరుగులు అవసరం కాగా.. మ్యాచ్ రెండోరోజు పది పరుగులు చేయగానే.. టెస్ట్‌లో 4వేల పరుగులు పూర్తి చేసి స్పెషల్ క్లబ్లో చేరాడు. జడేజా కంటే ముందు, కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెట్టోరి టెస్ట్‌లో 4వేల రన్స్, 300 వికెట్లు తీసిన ప్లేయర్లుగా ఘనత సాధించారు. వేగంగా మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడు జడేజా. 88 టెస్ట్ మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ లిస్ట్‌లో ఇమాన్ బోథమ్ ముందున్నాడు. 72 టెస్టుల్లోనే 4వేలు, 300 వికెట్లు పూర్తి చేశాడు. జడేజా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్. బ్యాటింగ్ సగటు 38 కంటే ఎక్కువ. 4వేల పరుగులు ఆరు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 15సార్లు ఐదు వికెట్లు తీశాడు.
కోల్‌కతా టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్ రెండవరోజునే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 పరుగులు చేసి దక్షిణాఫ్రికాపై 30 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ సమయంలో గాయపడ్డాడు. దాంతో రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ అత్యధికంగా 39 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశాడు. రాహుల్-వాషింగ్టన్ మధ్య రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. రిషబ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27), అక్షర్ పటేల్ (14), ధ్రువ్ జురెల్ 14, యశస్వి జైస్వాల్ (12), కుల్దీప్ యాదవ్ (1), మహ్మద్ సిరాజ్ (1) పరుగులు చేయగా.. జస్ప్రీత్ బుమ్రా 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ నాలుగు పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా తరఫున, సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్‌కు చెరో వికెట్ దక్కింది.