Team India Head Coach : టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(RahulDravid) పదవీ కాలం ముగియడానికి ఇంకా నెలపైనే ఉంది. దాంతో, ఆలోపై కొత్త కోచ్ నియామక ప్రక్రియను చేపట్టేందుకు మంగళవారం భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వాళ్లు మే 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దాంతో, కోచ్ రేసులో ఉండేది ఎవరు? అని సర్వత్రా చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri)తో పాటు హైదరాబాద్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)లు హెడ్‌కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వీళ్లిద్దరూ తాము పోటీలో ఉన్నారా? లేదా? అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
🚨 News 🚨
The Board of Control for Cricket in India (BCCI) invites applications for the position of Head Coach (Senior Men)
Read More 🔽 #TeamIndiahttps://t.co/5GNlQwgWu0 pic.twitter.com/KY0WKXnrsK
— BCCI (@BCCI) May 13, 2024
కపిల్ దేవ్ సారథ్యంలో 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన శాస్త్రి.. నాలుగేండ్ల కోచింగ్ కెరీర్లో భారత జట్టును వరల్డ్ నం 1 ర్యాంక్‌కు తీసుకెళ్లాడు. అతడి శిక్షణలో కోహ్లీ సేన 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా గద(Test Mace)ను ముద్దాడలేకపోయింది.
కోహ్లీ, రవిశాస్త్రి
మరోవైపు నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ సైతం టీమిండియా కోచ్ పదవిపై ఇష్టంగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో నిరుడు ఐర్లాండ్ పర్యటన(Ireland Tour)లో భారత జట్టుకు కోచ్‌గానూ పనిచేశాడు. అంతేకాదు టెస్టుల్లో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్‌కు ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
రవిశాస్త్రి, లక్ష్మణ్‌లకు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్(Justin Lagner) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న లాంగర్ సైతం టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు ఆతృతగా ఉన్నాడు.
లక్ష్మణ్, జస్టిన్ లాంగర్
ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) ఈమధ్యే భారత జట్టుకు కోచ్‌గా పనిచేసే చాన్స్ వస్తే వదులుకోను అని బాహంటగానే చెప్పాడు. దాంతో, అతడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నలుగురే కాకుండా కోచింగ్ పదవికి దరఖాస్తు చేసే ఔత్సాహికుల సంఖ్య పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత సీనియర్ పురుషుల జట్టుకు కాబోయే కొత్త హెడ్‌కోచ్‌కు ఉండాల్సిన లక్షణాలను బీసీసీఐ నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పింది. అవేంటంటే.. అభ్యర్థుల వయసు 60 ఏండ్ల లోపే ఉండాలి. వాళ్లు కనీసం 30 టెస్టులు, 50 వన్డేలు ఆడాలి. అంతేకాదు టెస్టు జట్టులో కనీసం రెండేండ్లు పూర్తి స్థాయి సభ్యులు అయినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్త కోచ్ పేరును బీసీసీఐ ప్రకటించనుంది.