Ravi Shastri : భారత క్రికెట్లో తొలి వరల్డ్ కప్ హీరో అయిన రవి శాస్త్రి (Ravi Shastri) ఆపై కోచ్‌గా చెరగని ముద్ర వేశాడు. తన మార్గనిర్దేశనంలో జట్టును నంబర్ 1గా నిలిపాడీ వెటరన్ ప్లేయర్. ప్రస్తుతం కామెంటేటర్‌గా అభిమానులను రంజింపజేస్తున్న శాస్త్రి తన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్లలో అత్యుత్తమ ఆటగాడి పేరును వెల్లడించాడు. అతడు ఎవరో కాదు.. విరాట్ కోహ్లీ. పరస్పర అవగాహనతో అద్భుతమైన ఫలితాలు రాబట్టిన వీరిద్దరిది నాలుగేళ్ల సావాసం. ఇంతకూ రవి శాస్త్రి రన్ మెషీన్ విరాట్‌నే ఎందుకు తన బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నాడో తెలుసా..?
‘నేను జాతీయ జట్టుక కోచ్‌గా పనిచేసిన రోజుల్లో కోహ్లీ అసాధారణంగా కనిపించేవాడు. మైదానంలో చిరుతలా కదిలే అతడు ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. ముఖాముఖి ఎదురుపడినా ఏమాత్రం వెనక్కి తగ్గడు. మెరుగైన ప్రదర్శన చేసేందుకు చాలా కష్టపడతాడు. కానీ, చాలా చక్కని షాట్లతో అలరిస్తాడు’ అని స్కై స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో శాస్త్రి తన డియరెస్ట్ ప్లేయర్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
‘కెప్టెన్‌గా విరాట్ గొప్పగా రాణించడంలో రవి శాస్త్రి పాత్ర చాలానే ఉంది. అతడి సలహాలు, సూచనలతో ఆటగాడిగా, సారథిగా కోహ్లీ ఎదురులేని శక్తిగా అవతరించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘కోహ్లీ అద్భుతమైన ప్లేయర్. మేమిద్దరం ఐదేళ్లలో జట్టును టెస్టుల్లో నంబర్ 1గా నిలిపాం. బ్యాటర్‌గా విరాట్ సాధించిన ఘనతలు చాలానే. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ ఆడిన తీరు.. ముందుండి జట్టును నడింపించిన విధానం వర్ణణాతీతం.
అందుకే.. నేను కోచింగ్ ఇచ్చిన వాళ్లలో అత్యుత్తమ ఆటగాడిగా కోహ్లని ఎంపిక చేశాను. కెప్టెన్సీకి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నందునే ధోనీ వారసుడిగా విరాట్‌కు పగ్గాలు అప్పగించాలని నేను సూచించాను’ అని శాస్త్రి వెల్లడించాడు. 2017 నుంచి 2021 వరకూ ఈ మాజీ ప్లేయర్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందించాడు.
Ravi Shastri hails Virat Kohli’s fiery temperament and unmatched batting in his prime, calling him the leader he always believed would take India forward. 🇮🇳💪🗣️#ViratKohli #Tests #ODIs #RaviShastri #Sportskeeda pic.twitter.com/OoNjP3TCfv
— Sportskeeda (@Sportskeeda) August 14, 2025
ధోనీ నుంచి 2014లో టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్.. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు సెంచరీలతో నాయకుడిగా తన చేవను చాటాడు. ఆ తర్వాతి ఐదేళ్లు రెడ్ బాల్ క్రికెట్లో శతకాలతో.. పరుగుల వరదతో ప్రకంపనాలు సృష్టించాడీ స్టార్. ఈ కాలంలో 63.27 సగటుతో 4,492 రన్స్ కొట్టిన కోహ్లీ 18 శతకాలు సాధించాడు. అదే జోరు కొనసాగిస్తాడనుకుంటే 2021 తర్వాత టచ్ కోల్పోయాడు. మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు కింగ్. టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన అనంతరం ఫొట్టి ఫార్మాట్‌ను వీడిన కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్‌లో ముంచెత్తాడు.