Ravi Shastri : ప్రపంచ క్రికెట్లో భారత జట్టు పేరు గట్టిగా వినిపించేలా చేసిన ఆటగాళ్లలో రవి శాస్త్రి(Ravi Shastri ) ఒకడు. 1983 వరల్డ్ కప్ హీరో అయిన ఆయన ఆ తర్వాత టీమిండియా కోచ్‌గానూ మెప్పించాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మాటల హోరుతో అలరిస్తున్న ఈ లెజెండరీ ఆటగాడు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించడం 24 క్యారెట్ల బంగారంతో సమానమైనది’ అని అన్నాడు.
‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరల్డ్ కప్ ఏమీ కాదు. కానీ, నాకు ఆ ట్రోఫీ విజయం నా కెరీర్లో చాలా గొప్పది. నేను 1983లో వరల్డ్ కప్ గెలచిన జట్టులో సభ్యుడిని. ఆ తర్వాత రెండేండ్లకు వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించిన టీమ్‌లోనూ ఉన్నా. అయితే.. వరల్డ్ కప్ కంటే ఆ తర్వాత వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలవడం నిజంగా 24 క్యారెట్ల బంగారంతో సమానం’ అని శాస్త్రి తెలిపాడు.
ఇక విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేల సారథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందుకున్న భారత జట్టు ప్రదర్శనను రవి శాస్త్రి ఆకాశానికెత్తేశాడు. ఆయన ఏం అన్నాడంటే..? ‘ప్రజలు వరల్డ్ కప్ విజయం గురించే మాట్లాడుకుంటారు. అయితే.. ఆటను బాగా ఇష్టపడే వాళ్లు మాత్రం ఆస్ట్రేలియా పర్యటనలో 2018-19, 2020-21లో భారత జట్టు సాధించిన సిరీస్ విజయాలను పదే పదే గుర్తు చేసుకుంటారు. అప్పటివరకూ ఆసీస్‌ను వాళ్ల సొంత గడ్డపై ఓడించిన జట్లు చాలా తక్కువ’ అని శాస్త్రి చెప్పాడు.
శ్రీలంక పర్యటన ముగియడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం బోర్డర్ గవాస్కర ట్రోఫీ కోసం భారత్ నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య నవంబర్ 22న తొలి మ్యాచ్ జరుగనుంది. 147 ఏండ్ల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో ఐదు మ్యాచ్‌లు నిర్వహించేందుకు అంగీకరించాయి. 1992 తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తున్నారు.
బీజీటీ ట్రోఫీతో రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్
టీమిండియా చేతిలో వరుసగా మూడు పర్యాయాలు(2018-19, 2020-21, 2023) ఓడిన కంగారూ జట్టు ఈసారి స్వదేశంలో బీజీటీని పట్టేయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఈ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించింది.