Balakrishna | రెండు తెలుగు రాష్ట్రాలను (two Telugu states) వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రంగంలోకి దిగిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.
‘50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నందమరి బాలకృష్ణ’ అని పేర్కొన్నారు.
#NBK donated 50 lakhs each to the CM Relief Fund of Telangana & Andhra Pradesh❤️👏
50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది..
50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది..
తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో… pic.twitter.com/emRH8bVQJz
— manabalayya.com (@manabalayya) September 3, 2024
Also Read..
Jr NTR | తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్
VishwakSen | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన హీరో విశ్వక్ సేన్
Trivikram srinivas | వరద బాధితుల కోసం త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబు భారీ విరాళం