హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్న హైదరాబాద్ జట్టు.. ఉప్పల్ వేదికగా మంగళవారం అస్సాంతో ప్రారంభమైన పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మన బౌలర్లు సత్తా చాటడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అస్సాం 205 పరుగులకు ఆలౌటైంది. స్వరూపమ్ పుర్క్యాస్థ (83) టాప్ స్కోరర్ కాగా.. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 4, కార్తికేయ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21), సంహిత్ రెడ్డి (11), మికిల్ జైస్వాల్ (4) ఔట్ కాగా.. రోహిత్ రాయుడు (22), రాహుల్ బుద్ధి (16) క్రీజులో ఉన్నారు.