Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రంజీల్లో ఆడనున్నాడు. వరుస పరాజయాల తర్వాత బీసీసీఐ ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కెప్టెన్ రోహిత్‌తో పాటు మరికొందరు ప్లేయర్స్ రంజీల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఢిల్లీ జట్టు రైల్వేస్‌తో చివరి మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్ ఆడనున్నారు. చివరిసారిగా నవంబర్ 2012లో ఘజియాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ ఆడాడు.
విరాట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నది. స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచడంతో పాటు స్టేడియంలో దాదాపు 10వేల మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మేరకు డీడీసీఏ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. నార్త్ ఎండ్, ఓల్డ్ క్లబ్ హౌస్‌ను అభిమానుల కోసం తెరవనున్నది. అదనపు సీటింగ్ ఏర్పాట్లు అవసరమైతే, మిగిలిన స్టాండ్స్‌ను గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ జట్టును ఢిల్లీ ఢీకొట్టనున్నది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి పాలైన ఢిల్లీ.. ప్రస్తుతం విరాట్ కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్నది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఆయుష్ బడోని ఒక్కడే పర్వాలేదనిపించాడు. రిషబ్ పంత్ విఫలమయ్యాడు. తాజాగా విరాట్ కోసం జట్టుతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నది. మ్యాచ్ టికెట్లను విక్రయించడం లేదని డీడీసీఏ ప్రకటించింది. జనవరి 30న మ్యాచ్ జరుగనున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టులో మెడనొప్పితో విరాట్ మైదానం వీడిన విసయం తెలిసిందే. తాజాగా రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని డీడీసీఏకు ఇప్పటికే సమాచారం ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత విరాట్ రంజీల్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగుతుండడంతో.. మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బ్యాట్‌తో పరుగుల వరద పారించి.. మళ్లీ ఫామ్‌లోకి తిరిగి వస్తాడని ఆశిస్తున్నారు.
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Team India | తిలక్ తడాఖా.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం