తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్‌వర్మ దుమ్మురేపాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో తన దమ్మేంటో చేతల్లో చూపెట్టాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను తిలక్ ఒంటిచేత్తో గెలిపించాడు. విజయంపై ఆశలు సన్నగిల్లిన వేళ తన విలువ చాటుతూ సహచర ప్లేయర్లతో కలిసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. అజేయ అర్ధసెంచరీతో చెలరేగిన తిలక్..గణతంత్ర దినోత్సవ వేళ దేశానికి అదిరిపోయే విజయాన్నందించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుస విజయాలు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Team India | చెన్నై: భారత్ ఖాతాలో మరో చిరస్మరణీయ విజయం. గెలుపుపై అసలు నమ్మకం లేని సమయాన యువ సంచలనం తిలక్‌వర్మ అన్నీతానై జట్టును ముందుండి నడిపించాడు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ముప్పేట దాడికి ఓవైపు సహచర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళుతున్న వేళ తనలోని పోరాటపటిమను వర్మ మరోమారు బయటకు తీశాడు. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 8 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
తిలక్‌వర్మ(55 బంతుల్లో 72 నాటౌట్, 4ఫోర్లు, 5సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో విజృంభించాడు. సుందర్(19 బంతుల్లో 26, 3ఫోర్లు, సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్రాండెన్ కార్స్(3/29) రాణించాడు. తొలుత కెప్టెన్ బట్లర్(45), కార్స్(31) ఆకట్టుకోవడంతో 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. అక్షర్‌పటేల్(32), వరుణ్ చక్రవర్తి(2/38) రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజ వేసింది. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన తిలక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓపెనర్ అభిషేక్‌శర్మ(12) మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. బుల్లెట్లా దూసుకొస్తున్న బంతులను అంతే వేగంతో అభిషేక్ బౌండరీలకు తరలించాడు. జోరు మీద కనిపించిన అభిషేక్‌ను రెండో ఓవర్లో వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఆర్చర్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే శాంసన్(5) భారీ షాట్ ఆడబోయి బౌండరీ దగ్గర కార్స్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 పరుగులకే టీమ్ఇండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వచ్చి రావడంతోనే కెప్టెన్ సూర్యకుమార్..ఆర్చర్‌ను ఫోర్లతో అరుసుకున్నాడు. మరో ఎండ్‌లో తిలక్ కూడా తానేం తక్కువ కాదన్నట్లు ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో 4, 6, 6తో చెలరేగడంతో 17 పరుగులు వచ్చి చేరాయి. బౌలింగ్ మార్పుగా వచ్చిన కార్స్‌కు వర్మ సిక్స్‌తో స్వాగతం పలికాడు. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో ఎనిమిది బంతుల తేడాతో సూర్యకుమార్‌తో పాటు జురెల్(4) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 66 పరుగులకే టీమ్ఇండియా 4 వికెట్లు కోల్పోయింది.
ఆశలు పెట్టుకున్న పాండ్యా(7)ను ఓవర్టన్ పెవిలియన్ పంపడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఓవైపు వికెట్లు పడుతున్నా..తిలక్ తన పోరాటాన్ని నమ్ముకున్నాడు. 10 పరగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ సుందర్..వుడ్ బౌలింగ్‌లో 6,4, 4తో చెలరేగాడు. సాఫీగా సాగుతున్న సమయంలో సుందర్‌ను ఔట్ చేసి కార్స్ మళ్లీ దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు ఇంగ్లండ్ అన్ని వైపులా నుంచి కత్తులు దూస్తున్నా..వెరవకుండా ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి తిలక్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
గత మ్యాచ్‌ను తలపిస్తూ తన తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్‌సింగ్(1/40)..సాల్(4)ను ఔట్ చేశాడు. డకెట్(3) కూడా నిరాశపర్చడంతో ఇంగ్లండ్ 26 పరుగులకే ఓపెనర్లు కోల్పోయింది. ఈ తరుణంలో కెప్టెన్ బట్లర్ జట్టును ఆదుకున్నాడు. భారత బౌలింగ్ దాడిని నిలువరిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. మిడిల్లో బ్రూక్(13), లివింగ్‌స్టోన్(13), ఓవర్టన్(5) విఫలమైనా ఆఖర్లో కార్స్(31) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లండ్:20 ఓవర్లలో 165/9(బట్లర్ 45, కార్స్ 31, అక్షర్ 2/32, వరుణ్ 2/38), భారత్: 20 ఓవర్లలో 166/8(తిలక్ 72 నాటౌట్, సుందర్ 26, కార్స్ 3/29, రషీద్ 1/14)