Harbhajan Singh | అయోధ్యలో రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఓ ముఖ్యమైన సందర్భం కానుందని భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని రాముడి ఆశీర్వాదం పొందాలని పిలుపునిచ్చారు. ఇది చారిత్రాత్మకమైన రోజని, శ్రీరాముడి అందరికీ ఆరాధ్యదైవమని.. ఆయన జన్మస్థలంలోనే ఆలయాన్ని నిర్మించడం విశేషమన్నారు. ఇందులో అందరూ భాగాస్వాములు కావాలన్నారు. తాను మతం, దేవుడిని అనుసరించేవాడనని.. దేవుడి కృప కోసం అవకాశం దొరికినప్పుడల్లా ఆలయాలు, గురుద్వారాలను సందర్శిస్తూ వస్తుంటానన్నారు.
మన జీవితకాలంలోనే ఆలయాన్ని ఆవిష్కరించడం శుభపరిణామన్న హర్భజన్ సింగ్.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవం రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై భజ్జీ స్పందిస్తూ.. ఎవరు ఏం చెప్పినా.. అసలు విషయం ఆలయాన్ని నిర్మించడమని.. మన కాలంలో ఇలాంటివి జరుగడం మన అదృష్టమన్నారు. ఎవరూ వెళ్లినా వెళ్లకపోయినా దేవుడిపై తనకున్న నమ్మకంతో తప్పకుండా అయోధ్యకు వెళ్తానన్నారు. ఒక పార్టీ వెళ్లినా, వెళ్లకపోయినా.. దేవుడిని నమ్మే నా స్టాండ్ ఇదేనన్నారు. ఎవరైనా వెళ్లాలనుకునేవారు వెళ్లవచ్చు.. ఎవరైనా వెళ్లకూడదనుకుంటే.. వెళ్లొద్దన్నారు.
తాను వెళ్లడం ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే.. వారు కోరుకున్నది చేయనివ్వండన్నారు. ఎందుకంటే తాను దేవుడిని నమ్మే వ్యక్తినని.. జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా.. నేనేమైనా సరే అది భగవంతుడి దయవల్లనేనని.. దేవడి ఆశీర్వాదం కోసం తప్పకుండా వెళ్తానని పొలిటీషియన్‌గా మారిన మాజీ క్రికెటర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అయోధ్య రామ జన్మభూమిలో ఈ నెల 22న బాల రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఇప్పటికే విగ్రహాన్ని గర్భాలయంలోకి తీసుకువచ్చారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందంతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.