ఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ప్రస్తుతం బోర్డులో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా.. త్వరలోనే బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయసు రిత్యా వచ్చే నెలలో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. జూలై 19 నాటికి బిన్నీకి 70 ఏండ్లు నిండుతాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి కూడా బోర్డులో ఏ రకమైన బాధ్యతలూ నిర్వర్తించేందుకు అర్హులు కాదు. దీని ప్రకారమే బిన్నీ స్థానంలో 65 ఏండ్ల శుక్లా ఆ బాధ్యతలు చేపట్టనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి.