Rajasthan Royals | ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ చెక్ పెట్టింది. శనివారం డబుల్ ధమాకాలో భాగంగా జరిగిన రెండో పోరులో పంజాబ్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో సొంత ఇలాఖాలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న పంజాబ్ ఆశలపై రాజస్థాన్ నీళ్లు గుమ్మరించింది. తొలుత యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 67, 3ఫోర్లు, 5సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు రియాన్ పరాగ్(25 బంతుల్లో 43 నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 205/4 స్కోరు చేసింది. ఆఖర్లో హెట్‌మైర్(12 బంతుల్లో 20, 2ఫోర్లు, సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ 200ల మార్క్ అందుకుంది. నిలకడలేమితో సతమతమవుతున్న జైస్వాల్..పంజాబ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాడు.
కెప్టెన్ సంజూ శాంసన్(38) సహకారంతో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవైపు చూడచక్కని షాట్లతో అలరిస్తూ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 3ఫోర్లు, 5 భారీ సిక్స్‌లతో దుమ్మురేపాడు. శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జైస్వాల్..పరాగ్తోనూ అదే దూకుడు కొనసాగించాడు. తానేం తక్కువ కాదన్నట్లు పరాగ్ కూడా చెలరేగడంతో పరుగుల రాక జోరందుకుంది. ఫెర్గుసన్‌కు(2/37) రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. నేహాల్ వధేరా(41 బంతుల్లో 62, 4ఫోర్లు, 3సిక్స్‌లు) మినహా అందరూ విఫలమయ్యారు. మాక్స్వెల్(30) రాణించాడు. ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కగా,యుధ్వీర్, తీక్షణ రెండేసి వికెట్లు తీశారు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 205/4(జైస్వాల్ 67, పరాగ్ 43 నాటౌట్, ఫెర్గుసన్ 2/37, అర్ష్‌దీప్ 1/35),
పంజాబ్: 20 ఓవర్లలో 155/9 (నేహాల్ 62, మ్యాక్స్‌వెల్ 30, సందీప్ 2/21, ఆర్చర్ 3/25)