చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకుని, వదిలేసే ఆటగాళ్ల జాబితాపై అందరిలోనూ ఆసక్తి నెలకొనగా ఒక ట్రేడ్ (ఆటగాళ్లను ఒక జట్టు నుంచి మరో జట్టుకు మార్చుకునే ప్రక్రియ) మాత్రం విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నది. రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ దీనిలో భాగమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కేరళ క్రికెటర్‌ను రాయల్స్ జట్టు.. చెన్నైకి ట్రేడ్ చేయనుందని చాలారోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రిటెన్షన్ తుది గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఇది నిజమేనన్న వాదనలు బలపడుతున్నాయి. శాంసన్‌ను రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ట్రేడ్ చేయనుండటం ఖాయమేనని తెలుస్తున్నది. ట్రేడింగ్‌లో భాగంగా రాయల్స్.. తమ జట్టుకు తొలి సీజన్లో ఆడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకోనున్నట్టు సమాచారం. జడ్డూతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్నూ సీఎస్కే.. రాజస్థాన్‌కు ట్రేడ్ చేయనున్నట్టు ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడిని ట్రేడ్ చేయాలనుకునే జట్టు ముందుగా ఈ విషయంపై బీసీసీఐకి సమాచారం (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అందించాలి. రిటెన్షన్ చివరి తేదీ నాటికి సరిగ్గా 48 గంటల ముందు ఈ ట్రేడ్ డీల్‌పై స్పష్టత రానుంది. ఇదిలాఉండగా ఐపీఎల్ ట్రేడ్ ప్రక్రియలో ఆటగాళ్ల సమ్మతి కూడా ముఖ్యం. అయితే సంజూతో పాటు జడ్డూ, కరన్ తమ ట్రేడ్‌కు సమ్మతించినట్టు సీఎస్కే ప్రతినిధి ఒకరు ‘క్రిక్‌బజ్’తో చెప్పారు.
రాయల్స్‌లో శాంసన్ గానీ చెన్నైకి జడ్డూ గానీ సుమారు దశాబ్దకాలం కంటే ఎక్కువే వారి జట్లతో సంబంధాలు కల్గినవాళ్లే. గత వేలానికి ముందు రాజస్థాన్.. రూ. 18 కోట్లతో శాంసన్‌ను రిటైన్ చేసుకుంది. 11 సీజన్లుగా అతడు రాయల్స్‌కు ఆడుతున్నాడు. మరోవైపు జడ్డూ సైతం 2012 నుంచి చెన్నై జట్టులో కీలకసభ్యుడిగా ఉన్నాడు. నిరుడు సీఎస్కే అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ (కరన్‌కు రూ. 2.4 కోట్లు) చేసుకుంది. గత సీజన్లో సంజూకు గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కు సారథ్య పగ్గాలు అప్పజెప్పడంపై రాయల్స్ యాజమన్యంతో అతడికి విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్నుంచే సంజూ.. ఫ్రాంచైజీని వీడనున్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. చెన్నై జట్టుకు వస్తే అతడికి ధోనీ స్థానాన్ని అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2025 సీజన్లో రుతురాజ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినా అతడు ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయాడు. ధోనీ మాదిరిగానే కెప్టెన్ కూల్‌గా ముద్రపడ్డ ఈ కేరళ క్రికెటర్‌ను తమ జట్టుకు సారథిగా నియమించుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్టు సమాచారం. మంగళవారం (నవంబర్ 11) సంజూ పుట్టినరోజు సందర్భంగా సీఎస్కే తమ ఎక్స్ ఖాతాలో ‘విషింగ్ యూ సూపర్ బర్త్‌డే’ అని ట్వీట్ వేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నది.
ఇక జడ్డూ.. ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ జట్టులో సభ్యుడు. గత కొన్నేండ్లుగా సీఎస్కే ఓనర్లతో అతడు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తుండగా.. రెండేండ్ల క్రితమైతే ధోనీ మధ్యవర్తిత్వంతో అతడు జట్టును వీడకుండా ఉన్నాడు. మరి సంజూ, జడ్డూ ట్రేడ్ డీల్ సక్సెస్ అవుతుందా? లేదా? తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.