అహ్మదాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో గుజరాత్‌పై రాజస్థాన్‌దే పైచేయి అయ్యింది. రాయల్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో గుజరాత్ నాలుగు పరుగులు చేసి వికెట్ కోల్పోయి ఓటమి వైపు నిలిచింది.
తుషార్ దేశ్‌పాండే సమయోచిత బౌలింగ్‌తో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఛేదనలో ఓపెనర్ సాయి సుదర్శన్(44 బంతుల్లో 73, 9ఫోర్లు, 3సిక్స్‌లు) బాధ్యాతాయుత అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సహచరుల నుంచి సహకారం కరువైంది. బట్లర్(26), కెప్టెన్ రషీద్‌ఖాన్(24), రబాడ(23 నాటౌట్) పోరాడినా ఆఖరి మెట్టుపై గుజరాత్ బోల్తా కొట్టింది.
భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. గిల్ గైర్హాజరీలో అరంగేట్రం ప్లేయర్ కుమార్ కుశాగ్ర(18)తో కలిసి సుదర్శన్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సుదర్శన్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో విజృంభించాడు. అయితే మిడిలార్డర్లో ఫిలిప్స్(3), సుందర్(4), తెవాటియా(12), షారుఖ్‌ఖాన్(11) స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఇంప్యాక్ట్ ప్లేయర్ రవి బిష్ణోయ్(4/41) నాలుగు కీలక వికెట్లు తీసి గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అంతకుముందు ధృవ్ జురెల్(42 బంతుల్లో 75, 5ఫోర్లు, 5సిక్స్‌లు), జైస్వాల్(55) అర్ధసెంచరీలతో రాజస్థాన్ 20 ఓవర్లలో 210/6 స్కోరు చేసింది. జురెల్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరిస్తూ జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాడు. రబాడ(2/42) ఆకట్టుకున్నాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 210/6(జురెల్ 75, జైస్వాల్ 55, రబాడ 2/42, అశోక్ 1/37),
గుజరాత్: 20 ఓవర్లలో 204/8(సుదర్శన్ 73, బట్లర్ 26, బిష్ణోయ్ 4/41, దేశ్‌పాండే 1/24)
