ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ప్లేయర్లున్నా.. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో విఫలమైంది. హెట్‌మైర్ మెరుపులతో ఓ మోస్తరు స్కోరు చేసిన రాజస్థాన్.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మెరుపు స్పెల్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా లక్నో హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ వేసిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది!
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్థాన్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. హార్డ్ హిట్టర్ హెట్‌మైర్ (36 బంతుల్లో 59 నాటౌట్; ఒక ఫోర్, 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. దేవదత్ పడిక్కల్ (29; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (28; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. 15 ఓవర్లు ముగిసేసరికి 92/4తో నిలిచిన రాజస్థాన్ ఆఖర్లో హెట్‌మైర్ మెరుపులతో మంచి స్కోరు చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్, జాసెన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (39)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతుల్లో కేఎల్ రాహుల్ (0), కృష్ణప్ప గౌతమ్ (0)లను ట్రెంట్ బౌల్ట్ గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపడంతో లక్నో కోలుకోలేక పోయింది. స్టోయినిస్ (17 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివర్లో పోరాడినా.. జట్టును గెలిపించలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4, బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టారు చాహల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
అశ్విన్ రిటైర్డ్ ఔట్
ఇన్నింగ్స్ ముగిశాక రాజస్థాన్ రాయల్స్ స్కోరు ఫర్వాలేదనిపించినా.. ఒక దశలో ఆ పరుగులు చేసేందుకు శాంసన్ సేన తీవ్రంగా తడబడింది. బట్లర్ (13), పడిక్కల్ మంచి ఆరంభాలను భారీ స్కోరుగా మలచలేకపోగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (13), డసెన్ (4) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన అశ్విన్ రెండు సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేసినా అదీ పెద్దగా ఫలించలేదు. దీంతో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరిన అశ్విన్.. చివరి ఓవర్లలో రియాన్ పరాగ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కృనాల్ పాండ్యా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హెట్‌మైర్ ఆరంభంలో క్రీజులో నిలబడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తానెదుర్కొన్న తొలి 25 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 18వ ఓవర్లో గేర్ మార్చిన హెట్‌మైర్ 6,4,6తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 19వ ఓవర్లో మరో రెండు సిక్సర్లు అరుసుకున్న హెట్‌మైర్ 33 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో హెట్‌మైర్, పరాగ్ (8) చెరో సిక్స్ బాదడంతో రాజస్థాన్ మంచి స్కోరు చేసింది. హెట్‌మైర్ ధాటికి రాయల్స్ చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు పిండుకోవడం విశేషం.
ఆది నుంచే తడబాటు..
ఓ మాదిరి లక్ష్యఛేదనకు దిగిన లక్నోకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ కాగా.. మరుసటి బంతికి కృష్ణప్ప గౌతమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ రెండు వికెట్లు బౌల్ట్ ఖాతాలోకి వెళ్లగా.. కాసేపటికే హోల్డర్ (8) కూడా వాళ్లను అనుసరించాడు. అక్కడి నుంచి డికాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పని భుజానెత్తుకోగా.. అతడికి దీపక్ హుడా (25) కాస్త సహకరించాడు. నయా సంచలనం ఆయుశ్ బదోనీ (5) భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ కాగా.. చాహల్ ఒకే ఓవర్లో డికాక్, కృనాల్ పాండ్యా (22)ను ఔట్ చేసి లక్నోను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆఖర్లో స్టొయినిస్ మెరుపులు మెరిపించినా అప్పటికే నష్టం జరిగిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 165/6 (హెట్‌మైర్ 59 నాటౌట్; కృష్ణప్ప 2/30, హోల్డర్ 2/50), లక్నో: 20 ఓవర్లలో 162/8 (డికాక్ 39, స్టొయినిస్ 38 నాటౌట్; చాహల్ 4/41, బౌల్ట్ 2/30).