లక్నో: బంతి ఆధిపత్యం చెలాయించిన ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సత్తాచాటి ఆ జట్టును మళ్లీ విజయాల బాట పట్టించారు. బుధవారం ఆ జట్టు.‘లో స్కోరింగ్ థ్రిల్లర్’గా సాగిన పోరులో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్‌ను 40 రన్స్ తేడాతో ఓవడించి రెండు పరాభవాల తర్వాత విజయాన్ని అందుకుంది. రాయల్స్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో లక్నో 18 ఓవర్లలో 119 వద్దే ఆగిపోయింది. మిచెల్ మార్ష్ (41 బంతుల్లో 55, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ (3/20) మూడు వికెట్లు తీయగా బ్రిజేష్, బర్గర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలుత లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్‌ను 20 ఓవర్లకు 159/6కే పరిమితం చేశారు. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 43 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా లక్నో 9వ స్థానానికి పడిపోయింది.
మార్ష్ ఒక్కడే..
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం లక్నో జట్టులో ఆవిరవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఛేదనలో ఆ జట్టు 3 ఓవర్లు కూడా పూర్తికాకముందే బదోని, కెప్టెన్ పంత్, మార్క్మ్ వికెట్లను కోల్పోయింది. ఈ ముగ్గురూ సున్నాలే చుట్టి పెవిలియన్ చేరడం గమనార్హం. తొలి ఓవర్లో లేని పరుగు కోసం యత్నించి బదోని రనౌట్ అవగా బర్గర్ బౌలింగ్‌లో పంత్.. జురెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడో ఓవర్లో ఆర్చర్.. మార్క్మ్న్రూ వెనక్కి పంపడంతో లక్నో పవర్ ప్లేలో 31/3తో ఉంది. పూరన్ (25 బంతుల్లో 22), మార్ష్ వంటి భారీ హిట్టర్లు క్రీజులో ఉన్నా ఆ జట్టు రన్‌రేట్ 11 ఓవర్ దాకా 6 లోపే నమోదైంది. పదో ఓవర్ నాలుగో బంతికి జడ్డూ.. పూరన్‌ను ఔట్ చేసి ఆ జట్టును మరింత దెబ్బతీశాడు. ఈ క్రమంలో గేర్ మార్చిన మార్ష్.. జడ్డూ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిమ్మత్ ఓ సిక్స్ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే యత్నం చేశాడు. కానీ బిష్ణోయ్ 15వ ఓవర్లో హిమ్మత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బర్గర్ 16వ ఓవర్లో సిక్స్‌తో మార్ష్ 39 బంతుల్లో ఈ సీజన్లో తొలి హాఫ్‌సెంచరీని సాధించాడు. కానీ రెండు బంతుల తర్వాత అతడే.. పరాగ్‌కు క్యాచ్ ఇవ్వడంతో రాయల్స్ గెలుపు రేసులోకి వచ్చింది. చివరి 4 ఓవర్లలో లక్నో విజయానికి 49 రన్స్ అవసరమవగా బ్రిజేష్ బౌలింగ్‌లో ముకుల్ (7).. ఎక్స్ట్రా కవర్స్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇవ్వడంతో లక్నో ఓటమి ఖాయమైంది. అదే ఓవర్లో బ్రిజేష్.. షమీ(6)నీ బౌల్డ్ చేశాడు. ఆర్చర్ లోయరార్డర్ పనిపట్టాడు.
రాయల్స్ కట్టడి
బౌలర్లకు అనుకూలించే లక్నో పిచ్‌పై ఆ జట్టు బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసి రాయల్స్‌ను కట్టడిచేశారు. అదీగాక రాజస్థాన్ ఓపెనర్ల మీద ఎంత ఆధారపడిందో తెలియడానికి గత మ్యాచ్ మాదిరిగానే నేటి పోరూ మరో ఉదాహరణ. జైస్వాల్ (22), సూర్యవంశీ (8)తో పాటు ధృవ్ జురెల్ డకౌట్ అవగానే పరాగ్ సేన మరోమారు తక్కువ స్కోరుకే పరిమితమైంది. షమీ మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన జైస్వాల్.. నాలుగో బంతికి పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జురెల్ కూడా అతడినే అనుసరించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వండర్ కిడ్ వైభవ్.. మోహ్సిన్ బంతిని భారీ షాట్ ఆడబోయి కవర్స్‌లో దిగ్వేశ్ రాతికి చిక్కాడు. ఈ క్రమంలో కెప్టెన్ పరాగ్ (20), హెట్మెయర్ (22) ఐదు ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ధాటిగా ఆడలేకపోయారు. ప్రిన్స్ తన రెండో స్పెల్‌లో పరాగ్‌ను ఔట్ చేయడంతో రాయల్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. మయాంక్ బౌలింగ్‌లో 6,4తో జోరుమీద కనిపించిన హెట్మెయర్.. మోహ్సిన్ 11వ ఓవర్లో ప్రిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. రాయల్స్ భారీ ఆశలు పెట్టుకున్న డొనొవన్ ఫెరీరా (20) కూడా క్రీజులో నిలిచేందుకు తంటాలుపడ్డాడు. 16 ఓవర్లలో 110/6తో ఉన్న రాయల్స్ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జడేజా, ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే (19)ల పోరాటమే. మయాంక్ ఆఖరి ఓవర్లో జడ్డూ.. రెండు బౌండరీలు, సిక్స్‌తో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లకు 159/6 (జడేజా 43*, జైస్వాల్ 22, మోహ్సిన్ 2/17, ప్రిన్స్ 2/29); లక్నో: 18 ఓవర్లకు 119 ఆలౌట్ (మార్ష్ 55, పూరన్ 22, ఆర్చర్ 3/20, బ్రిజేష్ 2/18)