గువహతి : ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లలో పరాభవాలు ఎదుర్కున్న ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం చివరిబంతి వరకూ ఉత్కంఠగా జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (2/28), పతిరాన (2/28), ఖలీల్ అహ్మద్ (2/38) రాజస్థాన్‌ను కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో చెన్నై.. 20 ఓవర్లలో 176/6 వద్దే ఆగిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63, 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. హసరంగ (4/35) కీలక వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్ (1/13) కట్టుదిట్టంగా బంతులేసి చెన్నైని ఆరంభంలోనే దెబ్బకొట్టాడు.
ఖలీల్ తొలి ఓవర్లో మూడో బంతికే జైస్వాల్ (4)ను ఔట్ చేసి చెన్నైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ ఈ సీజన్లో రాజస్థాన్‌కు ఆడుతున్న రాణా.. ఆరంభం నుంచే సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్ ఎవరన్నదీ లెక్కచేయకుండా అతడు వీరబాదుడు బాదాడు. ఓవర్టన్ 4వ ఓవర్లో 16, అశ్విన్ ఐదో ఓవర్లో 19 పరుగులు పిండుకున్న అతడు 21 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు. శాంసన్ (20) విఫలమైనా పరాగ్‌తో కలిసి మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించిన అతడు క్రీజులో ఉన్నంతసేపు చెన్నై బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ అశ్విన్ వేసిన 12వ ఓవర్లో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రాణాను ధోనీ స్టంపౌట్ చేయడంతో అతడి కథ ముగిసింది. ఆఖర్లో హెట్మెయర్ (19) మెరుపులు మెరిపించాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 182/9 (రాణా 81, పరాగ్ 37, నూర్ 2/28, పతిరాన 2/28);
చెన్నై: 176/6 (రుతురాజ్ 63, జడేజా 32, హసరంగ 4/35, ఆర్చర్ 1/13)