గువాహటి : ఐపీఎల్-19వ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ఆరంభించింది. గువాహటిలోని బర్సపుర స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్స్.. ఐదుసార్లు చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 8వికెట్ల తేడాతో ఓడించి సునాయాస విజయం సాధించింది. రవీంద్ర జడేజా (2/18), జోఫ్రా ఆర్చర్ (2/19), నండ్రె బర్గర్ (2/26)తో కూడిన రాజస్థాన్ బౌలింగ్ ధాటికి దారుణంగా విఫలమైన చెన్నై.. 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో జెమీ ఓవర్టన్ (43) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్.. 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. మూడు రోజుల క్రితమే 15వ పడిలోకి అడుగుపెట్టిన ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షం చేసేశాడు.
సొంత వేదికలో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్ రెగ్యులర్ సారథి రియాన్ పరాగ్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ఆ జట్టు పేసర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. ఈ సీజన్లో రాజస్థాన్ నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిన సంజూ శాంసన్ (6) బర్గర్ రెండో ఓవర్లో వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయి అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. 2020 తర్వాత ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేయకపోవడం సంజూకు ఇదే మొదటిసారి. మూడో ఓవర్లో ఆర్చర్.. రుతురాజ్ (6)ను బౌల్డ్ చేశాడు. బర్గర్ మరుసటి ఓవర్లో ఆయూశ్ను డకౌట్ చేయగా మాథ్యూ షార్ట్ (2) సందీప్ శర్మ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 41/4తో నిలిచింది. 8వ ఓవర్లో బంతినందుకున్న జడేజా.. గత సీజన్ దాకా తాను ఆడిన ఫ్రాంచైజీపై కసితీర్చుకున్నాడా? అన్నట్టుగా ఒకే ఓవర్లో సర్ఫరాజ్ (17), దూబె (6) వికెట్లు పడగొట్టి చెన్నైని కోలుకోనీయకుండా చేశాడు. వేలంలో చెన్నై రూ. 14 కోట్లు ధర పెట్టి కొన్న కార్తీక్ శర్మ (18)ను బ్రిజేశ్ 11వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో చెన్నై కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఓవర్టన్ మెరుపులతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
స్వల్ప ఛేదనను రాజస్థాన్ పెద్దగా కష్టపడకుండానే పూర్తిచేసింది. ఎప్పట్లాగే వైభవ్.. ధనాధన్ మెరుపులతో పవర్ ప్లే ముగిసేసరికే ఆ జట్టు విజయం ఖాయం అయింది. ఎదుర్కున్న తొలి బంతినే పుల్‌షాట్ ఆడబోయి మిడ్‌వికెట్ వద్ద కార్తీక్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన అతడు.. ఆ తర్వాత ఆగలేదు. హెన్రీ ఓవర్లో సిక్స్ బాదిన అతడు కంబోజ్ ఐదో ఓవర్లో 4,4,6 కొట్టాడు. నూర్ అహ్మద్‌కు రెండు సిక్స్‌లతో స్వాగతం పలికి 15 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ధాటిగా ఆడే క్రమంలో వైభవ్‌ను కంబోజ్ ఏడో ఓవర్లో ఔట్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. అతడి స్థానంలో వచ్చిన జురెల్ (18) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయితే జైస్వాల్ (38 నాటౌట్), కెప్టెన్ పరాగ్ (14 నాటౌట్) మరో వికెట్ పడకుండా లాంఛనాన్ని పూర్తిచేశారు.
చెన్నై: 19.4 ఓవర్లలో 127 ఆలౌట్ (ఓవర్టన్ 43, కార్తీక్ 18, జడేజా 2/18, ఆర్చర్ 2/19);
రాజస్థాన్: 12.1 ఓవర్లలో 128/2 (వైభవ్ 52, జైస్వాల్ 38*, అన్షుల్ 2/27)