ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. అయితే అవసరమైనంత వేగంగా టార్గెట్ ఛేజ్ చేయలేకపోయిన శాంసన్ సేన.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరు, ముంబై భారీ పరాజయాల పాలైతే.. రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరనుంది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో మొదట బౌలర్లు సత్తాచాటగా.. లక్ష్యఛేదనలో యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలు సాధించడంతో రాజస్థాన్ గెలుపు గీత దాటింది.
ధర్మశాల: తాజా సీజన్లో పడుతూ లేస్తూ సాగిన రాజస్థాన్ రాయల్స్.. చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. ఈ పరాజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. రాజస్థాన్ ఇతర జట్ల జయాపజయాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జితేశ్ శర్మ (28 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షారుక్ ఖాన్ (23 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటగా.. హెట్‌మైర్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. పడిక్కల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శనివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో ఢిల్లీతో చెన్నై, కోల్‌కతాతో లక్నో తలపడనున్నాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్ట్ పట్టిన సూపర్ రిటర్న్ క్యాచ్‌కు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) ఔట్ కాగా.. శిఖర్ ధవన్ (17) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అథర్వ తైడె (19), లియామ్ లివింగ్‌స్టోన్ (9) వాళ్లను అనుసరించడతో పంజాబ్ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సామ కరన్, జితేశ్ శర్మ ఆ జట్టును ఆదుకున్నారు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కరన్ ఆరంభంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడగా.. జితేశ్ శర్మ స్వేచ్ఛగా ఆడాడు. క్రీజులో కుదురుకున్నాక కరన్ బ్యాట్‌కు పనిచెప్పగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ జట్టుకు మంచి ముగింపు నిచ్చాడు. కరన్, షారుక్ జోడీ చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు రాబట్టడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. చాహల్ వేసిన 19వ ఓవర్లో ఈ ఇద్దరూ 4,6,6,6,4 రాబట్టగా.. బౌల్ట్ వేసిన చివరి ఓవర్లో షారుక్ 4,6,4 కొట్టాడు. వీరిద్దరూ అజేయమైన ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 73 పరుగులు సాధించారు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ ఫోర్లు దంచగా.. రెండో ఓవర్లో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (0) డకౌటయ్యాడు. దీంతో పడిక్కల్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ధనాధన్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించిన పడిక్కల్ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకొని వెనుదిరిగాడు. కెప్టెన్ శాంసన్ (2) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. జైస్వాల్, హెట్‌మైర్ ఆ జట్టును పోటీలో నిలిపారు. ఆఖర్లో జురేల్ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
పంజాబ్: 187/5 (సామ్ కరన్ 49 నాటౌట్; జితేశ్ 44; నవ్‌దీప్ 3/40),
రాజస్థాన్: 19.4 ఓవర్లలో 189/6 (పడిక్కల్ 51, యశస్వి 50; రబడ 2/40).