IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్(IPL Play Offs) పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ మూడు బెర్తులు ఖరారవ్వగా.. నాలుగో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఆఖరి స్థానం కోసం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Begngaluru) కాచుకొని ఉన్నాయి. మే 18 శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. అయితే.. ఈ పోరుకు సైతం వరుణుడి ముప్పు ఉందిన భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మ్యాచ్ రోజైన శనివారం 99 శాతం ఆకాశం మబ్బు పట్టి ఉంటుంది. ఆ రోజు 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అంతేకాదు 34 శాతం వడగళ్లు పడేందుకు చాన్స్ ఉంది. ఆ రోజు సాయంత్రం చినుకులు పడేందుకు 90 శాతం అవకాశముంది అని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో, మ్యాచ్ రద్దు అయితే.. ఇరుజట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు 15 పాయింట్లతో చెన్నై దర్జాగా ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ఒకవేళ పూర్తి ఆట సాధ్యమై చెన్నై గెలిస్తే బెంగళూరు ఇంటిదారి పట్టడం ఖాయం. అలా కాకుండా ఆర్సీబీ విజయం సాధిస్తే 14 పాయింట్లతో రేసులోనే ఉంటుంది. అయితే.. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ 200 టార్గెట్‌ను ఛేదించాల్సి వస్తే.. 18.1 ఓవర్లోనే డూప్లెసిస్ సేన మ్యాచ్‌ను ముగించాలి. అప్పుడు నెట్రన్ రేటులో సూపర్ కింగ్స్‌ను ఆర్సీబీ దాటేసి.. నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.

పదిహేడో సీజన్లో ఆల్‌రౌండ్ షోతో ఇరగదీస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ అన్నిజట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ చేరింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్లో రికార్డులు బద్ధలు కొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) సైతం ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో, 15 పాయింట్లతో కమిన్స్ సేన నాకౌట్ పోరులో నిలిచింది.