RCB Vs CSK | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉన్నది. ఈసారైనా కప్పు కొట్టాలని భావిస్తున్న ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాలని భావిస్తున్నది. ఆర్సీబీ RCB 10 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, మూడు పరాజయాలతో 14 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు, సీజన్లో చెత్త ప్రదర్శనతో ప్లేఆఫ్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది.
సీఎస్కే ఆడిన పది మ్యాచుల్లో ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎస్కే చెత్త ఫామ్ కొనసాగుతున్నా.. అభిమానులు మాత్రం మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టోర్నమెంట్లో ఇప్పటివరకు అతను 443 పరుగులు చేశాడు. అదే సమయంలో ధోనీ తన కెరియర్ చివరి దశలో ఉన్నందున.. మహిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ.. ఈ మ్యాచ్కు వానగండం పొంచి ఉన్నది. గత కొద్దిరోజులుగా బెంగళూరులో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం సైతం ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
బెంగళూరులో శనివారం వానపడే అవకాశం 70శాతం ఉందని అంచనా వేసింది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య కూడా వర్షం పడే అవకాశం ఛాన్స్ ఉందని తెలిపింది. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, చిన్నస్వామి స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ బాగుందని.. మ్యాచ్కు ముందు వర్షం పడితే వీలైనంత త్వరగా ఆట ప్రారంభించేందుకు మైదానం వేగంగా సిద్ధం చేయవచ్చని స్టేడియం నిర్వాహకులు పేర్కొంటున్నారు. వర్షం కారణంగా, ఆర్సీబీ, సీఎస్కే ప్రాక్టీస్ సైతం ప్రభావితమైంది. బెంగళూరులో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడం ఈ సీజన్లో ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు వర్షం కారణంగా ఆర్సీబీ-పంజాబ్ మధ్య మ్యాచ్ ఆలస్యంగా మొదైలంది. దాంతో 20 ఓవర్ల మ్యాచ్కు కుదించారు. నేటి మ్యాచ్ మాత్రం 20-20 ఓవర్లు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.