జైపూర్: భారత దిగ్గజ క్రికెటర్, గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. 2026 సీజన్ వేలం ప్రక్రియకు ముందే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ద్రవిడ్‌కు ఇప్పుడున్న పదవి (హెడ్‌కోచ్) కంటే ఉన్నత స్థానాన్ని కల్పిస్తామని రాయల్స్ హామీ ఇచ్చినా ద్రవిడ్ దానిని తిరస్కరించాడని ఆ జట్టు తెలిపింది. ‘రాయల్స్ ప్రయాణంలో రాహుల్ చాలాకాలంగా కీలకంగా ఉన్నాడు. జట్టు ఆటగాళ్లపై అతడి ప్రభావం చాలా ఉంది. ద్రవిడ్ నాయకత్వం జట్టులోని చాలా మంది ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచింది.
జట్టులో బలమైన విలువలను పెంపొందించి ఫ్రాంచైజీపై చెరగని ముద్ర వేశాడు. ఫ్రాంచైజీ స్ట్రక్చరల్ రివ్యూలో భాగంగా ప్రస్తుతమున్న స్థానానికంటే ఉన్నత స్థానం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించాడు. జట్టుకు ఆయన అందించిన సేవలకు గాను మేం కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని రాయల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్లో 2011 నుంచి 2013 దాకా రాజస్థాన్ సారథిగా సేవలందించిన ద్రవిడ్.. ఆ తర్వాత రెండేండ్లపాటు జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నాడు. మళ్లీ తొమ్మిదేండ్ల తర్వాత నిరుటి సీజన్‌కు ముందు రాయల్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. కానీ ఒక్క ఏడాదిలోనే రాజస్థాన్‌తో ఆయన ప్రయాణం ముగిసింది.