Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని అన్నాడీ లెజెండ్. చిన్నస్వామి తొక్కిసలాటను దురదృష్టకరమైనదిగా పేర్కొన్న ద్రవిడ్.. తమ అభిమాన జట్టు విక్టరీ పరేడ్‌ను చూద్దామని వచ్చిన ఫ్యాన్స్ అసువులు బాయడం తన మనసును చాలా బాధిస్తోందని అన్నాడు.
‘క్రీడల్ని ఎంతగానో ప్రేమించే నగరం బెంగళూరు. నేను అక్కడి నుంచే వచ్చాను. అక్కడి ప్రజలు క్రికెట్ ఒక్కటే కాదు అన్ని ఆటల్ని చాలా ఇష్టపడుతారు. ఫుట్‌బాల్ జట్టు అయినా.. కబడ్డీ జట్టు అయినా సరే చాలా మద్ధతిస్తారు. ఆర్సీబీ అయితే చాలా పాపులర్. ఎక్కువమంది అభిమానులున్న జట్టు కూడా. అలాంటి సిటీలో ఇంత దారుణం జరగడం దురదృష్టకరం. తొక్కిసలాట విషయం తెలిసి షాకయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు రాహుల్ ద్రవిడ్. వాళ్లది మరాఠీ బ్రాహ్మణ కుటుంబం. అతడి చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం బెంగళూరుకు వలస రావడంతో అతడు అక్కడే పెరిగాడు. దాంతో, ద్రవిడ్ దేశవాళీ క్రికెట్ (Domestic Cricket)లో కర్నాటక తరఫున అరంగేట్రం చేశాడు. అందుకే.. అతడికి బెంగళూరు అంటే చాలా ఇష్టం. పైగా ఐపీఎల్ ఆరంభంలో అతడు ఆర్సీబీకి ఆడాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthn Royals) జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి కప్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18వ సీజన్లో ఛాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై జయభేరి మోగించి తమ ఐపీఎల్ ట్రోఫీ కలను సాకారం చేసుకుంది. తమ అభిమాన జట్టు విజేతగా నిలవడంతో బెంగళూరు అభిమానులు పొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పరేడ్‌కు పెద్ద సంఖ్యలో కదిలారు.
అయితే.. చిన్నస్వామి స్టేడియం సామర్ధ్యం 35 వేలు కాగా.. దాదాపు 2.5 లక్షల మంది వచ్చారు. దాంతో.. పోలీసులు అభిమానులను అదుపు చేయలేకపోయారు. సాయంత్రం ఒక్కసారిగా మైదానం గేట్లు తెరవడంతో ఫ్యాన్స్ భారీ కేడ్లు ఎక్కిమరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 56 మంది గాయపడ్డారు.
ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన కర్నాటక సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. కర్నాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ కంపెనీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోడం.. భద్రతాపరమైన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ తొక్కిసలాటకు ఒక కారణం. దాంతో.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సెక్రటరీ ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు.. తొక్కిసలాట విషయమై ఆర్సీబీ యాజమాన్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
The Government of Karnataka has ordered a Magisterial Inquiry into the tragic stampede during RCB’s victory celebrations at Chinnaswamy Stadium.
The Deputy Commissioner of Bengaluru Urban District has been appointed as the Inquiry Officer. The report will be submitted within 15… pic.twitter.com/yQsUipcGnY
— Siddaramaiah (@siddaramaiah) June 5, 2025