Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) కమ్‌బ్యాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మెంటో కార్లో మాస్టర్స్ టోర్నీ(Monte Carlo Masters 1000)లో ఆడనున్నాడనే వార్తల్ని ఖండించాడు. ఇలాంటి తప్పుడు అవాస్తవాలను ఎవరు ప్రచారం చేస్తారో తెలియదని, నేను మళ్లీ టెన్నిస్ కోర్టులో ఎప్పుడు అడుగుపెడతానో చెప్పలేనని స్పెయిన్ బుల్ అన్నాడు.
‘మోంటె కార్లో మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో ఆడతానని కచ్చితంగా చెప్పలేను. రోజు రోజుకు కొంత మెరుగవుతున్నా. ఇదే నిజం. నేను పూర్తిగా కోలుకుని, ఫిట్నెస్ సాధించిన రోజు పునరాగమనం గురించి తెలియజేస్తాను’ అని నాదల్ తెలిపాడు. ఏప్రిల్ నెలలో మోంటె కార్లో మాస్టర్స్ టోర్నీ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే నాదల్ ఇంటిదారి పట్టాడు. మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత నాదల్ రాకెట్ ముట్టలేదు. ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేదు. 36 ఏళ్ల వయసున్న రఫా ఎడమ తొడ గాయంతో బాధపడుతున్నాడు. అతను మళ్లీ మైదానంలోకి దిగేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో, ఈ స్టార్ ప్లేయర్ ఈ ఏడాది చాలా టోర్నమెంట్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
క్లే కోర్ట్ కింగ్‌గా పేరొందిన ఈ స్పెయిన్ బుల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ వంటి స్టార్ ప్లేయర్స్‌పై పై చేయి సాధించాడు. అయితే.. గాయాలు వెంటాడడంతో కొన్నిరోజులు టెన్నిస్‌కు దూరమయ్యాడు. పునరాగమనం తర్వాత మునపటి నాదల్‌ను గుర్తు చేశాడు. పవర్ఫుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడి టైటిళ్లు సాధించాడు. సుదీర్ఘ కాలం వరల్డ్ నంబర్ 1గా కొనసాగాడు. అయితే.. ఈమధ్యే టాప్ -10లో చోటు దక్కించుకోలేక పోయాడు.