Rafael Nadal : ప్రపంచ టెన్నిస్‌లో ఓ లెజెండరీ ఆటగాడి శకం ముగిసింది. ఇక ఆడలేనంటూ ఓ దిగ్గజం రాకెట్ పక్కన పడేశాడు. టెన్నిస్‌లో శిఖరంగా వెలుగొందిన అతడు మట్టికోటలో మహరాజుగా పేరొందాడు. 19 ఏండ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన అతడు.. గాయాలతో పోరాడి అలసిపోయి తనకు ప్రాణమైన ఆటకు అల్విదా పలికాడు. అతడే.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (Rafael Nadal). అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు, గుర్తుండిపోయే పోరాటాలతో అభిమానుల గుండెల్లో నిలిచిన నాదల్ ప్రస్థానం సాగిందిలా..
టెన్నిస్ దిగ్గజంగా కెరీర్ ముగించిన నాదల్ స్పెయిన్‌లోని మల్లోర్కా అనే ద్వీపంలో పుట్టాడు. చిన్నప్పుడే టెన్నిస్‌కు ఆకర్షితుడైన అతడు రాకెట్ అందుకొని తన సొంతూరైన మనకొర్లో స్నేహితులతో కలిసి సాధన చేసేవాడు. సరదాగా మొదలైన అతడి టెన్నిస్ ప్రయాణం ఆ తర్వాత ఈ ప్రపంచానికి ఓ యోధుడిని పరిచయం చేసింది.
పురుషుల టెన్నిస్‌లో నాదల్ ఓ దిగ్గజం కావడం వెనుక అతడి మామయ్య పాత్ర మరువలేనిది. ఎందుకంటే ఆయనే రఫాకు తొలి గురువు మరి. నాదల్ ఆసక్తిని గమనించిన టోనీ నాదల్ (Toni Nadal) అతడికి 2005 నుంచి 2017 వరకూ కోచింగ్ ఇచ్చాడు. ఫుట్‌బాలర్ అయిన మరో అంకుల్ మిగెల్ ఆంజెల్ నాదల్ కూడా రఫాకు మెలకువలు నేర్పేవాడు.
ఆరడుగుల పైబడి ఉండే నాదల్ విజయ ప్రస్థానం 18 ఏండ్ల నుంచే మొదలైంది. 2004లో డేవిస్ కప్‌లో స్పెయిన్ తరఫున అతడు తొలి విజయం నమోదు చేశాడు. అది కూడా అమెరికా స్టార్ ఆండీ రాడిక్‌ను ఓడించి చరత్ర సృష్టించాడు. అంతేకాదు స్పెయిన్ తరఫున డేవిస్ కప్ గెలుపొందిన చిన్న వయస్కుడిగా నాదల్ రికార్డు నెలకొల్పాడు.
డేవిస్ కప్ విజయంతో ప్రకంపనలు సృష్టించిన నాదల్.. ఆ మరుసటి ఏడాది తన పేరు మరింత గట్టిగా వినిపించేలా చేశాడు. అవును 19 ఏండ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ సాధించి భవిష్యత్ తార నేనే అంటూ ప్రపంచానికి చాటాడు. 2005లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ సంచలనం సృష్టించాడు.
అప్పటికే స్టార్ అయిన రోజర్ ఫెదరర్‌ను సెమీస్‌లో ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఫైనల్లోనూ చెలరేగిన ఈ స్పెయిన్ బుల్ మరియానో పురెట్టాకు చెక్ పెట్టి తొలి ట్రోఫీని అందుకున్నాడు. ఆ రోజుతో ఫెదరర్‌ను ఓడించే.. రేపటి హీరోగా వెలుగొందే యోధుడు పుట్టుకొచ్చాడనే విషయం టెన్నిస్ అభిమానులకు తెలిసొచ్చింది.
టెన్నిస్ చరిత్రలో నాదల్ తన ఆత్మీయ ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో మరపురాని ఫైనల్ ఆడాడు. 2006, 2007లో వరుసగా వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలో ఓడిన రఫా.. 2008లో విజేతగా అవతరించాడు. టైటిల్ పోరులో స్విస్ స్టార్‌తో నువ్వానేనా అన్నట్టు తలపడ్డాడు. చివరకు 5 సెట్ల థ్రిల్లర్‌లో స్పెయిన్ బుల్‌ను విజయం వరించింది. ఆ ఫైనల్ మ్యాచ్‌ను విశ్లేషకులే కాదు టెన్నిస్ అభిమానులు సైతం గ్రేటెస్ట్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌గా అభివర్ణిస్తుంటారు.
ప్రియమైన ప్రత్యర్థి ఫెదరర్‌తో..
టెన్నిస్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్ అంటే.. ఏడాదిలో నాలుగుకు నాలుగు గ్రాండ్‌స్లామ్స్ గెలుపొందడం. 2010లో నాదల్ వరుసపెట్టి ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టాడు. అంతేకాదు 2008 వేసవి ఒలింపిక్స్‌లో పసిడితో మెరిసి కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించాడు. ఆండ్రూ అగస్సీ తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు.
అంతేకాదు.. స్వీడన్‌కు చెందిన జోర్న్ బోర్గ్ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుపొందిన ఆటగాడిగా నాదల్ రికార్డు పుటల్లోకెక్కాడు. 2006 నుంచి 2008 మధ్య ఫెదరర్‌ను నాలుగు సెట్లలోనే మట్టికరిపించి క్లే కోర్టు కింగ్‌కు ఆవిర్భవించాడు రఫా. మట్టి కోర్టుపై తనకు తిరుగులేదని చాటుతూ.. మకుటం లేని మహరాజుగా వెలుగొందిన నాదల్ రికార్డు స్థాయిలో 14 టైటిళ్లు గెలవడం విశేషం.
టెన్నిస్‌లో గొప్ప ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. కానీ.. రోజర్ ఫెదరర్, నాదల్, జకోవిచ్ మాత్రం వాళ్లకంటే ప్రత్యేకం. ఎందుకంటే.. దాదాపు ఒకేతరంలో పుట్టుకొచ్చిన రాకెట్ వీరులు ఈ ముగ్గురు. గ్రాండ్‌స్లామ్ అయినా.. ఏటీపీ టోర్నీ అయినా ఫైనల్లో ఈ ముగ్గురు మొనగాళ్లలో ఎవరో ఇద్దరు ఫైనల్ ఆడేవాళ్లు.
రెండేండ్ల క్రితం(2022) ఫెదరర్ వీడ్కోలు తర్వాత.. నాదల్, జకోవిచ్‌లు దాదాపు ప్రతి టైటిల్ పోరులో తలపడ్డారు. అలాంటిది.. తొడకండరాల గాయం నాదల్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది. 2023 నుంచి ఆ గాయం నుంచి కోలుకుంటూ.. రాకెట్ పడుతూ వచ్చిన అతడు ఇక అలిసిపోయానంటూ వీడ్కోలు పలికేశాడు.