శ్రీనగర్: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో మెజారిటీ పార్టీగా రాణించింది. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీపై ఆధారపడకుండా సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్సీ 42 సీట్లు, కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ఒమర్ అబ్దుల్లా సన్నద్ధమయ్యారు.
కాగా, స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్యారే లాల్ శర్మ, సతీష్ శర్మ, చౌదరి మహ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్ తాజాగా ఎన్సీకి తమ మద్దతు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ అయిన 46 స్థానాలకు ఎన్సీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో కేవలం ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సభ్యుల సపోర్ట్ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీకి వీలుంది. దీంతో జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారనున్నది.
మరోవైపు జమ్ము ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ ఊహించినట్లుగానే 29 సీట్లు గెలుచుకున్నది. ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ సంఖ్యా బలం 32కు చేరింది. అయితే మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈ ఎన్నికల్లో కుప్పకూలింది. 2014లో 28 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఈసారి దారుణంగా మూడు సీట్లలో మాత్రమే గెలిచింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో హంగ్ ఏర్పడితే కింగ్‌మేకర్ కావాలని భావించిన మెహబూబా ముఫ్తీ ఆశలు ఆవిరయ్యాయి.