ఢిల్లీ: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-19 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఇందుకు సంబంధించిన వేదికలను వెల్లడించింది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది సైతం అహ్మదాబాద్‌లోనే ఫైనల్‌ను నిర్వహించాలని బోర్డు ఖరారుచేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి ఫైనల్ ఆతిథ్య హక్కులు దక్కుతాయని ఆశించినా బోర్డు నిర్దేశించిన నిబంధనల పరిమితికి లోబడి స్థానిక అసోసియేషన్‌లో పరిస్థితులు లేకపోవడంతో వేదికను మార్చినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
క్వాలిఫయర్-1కు ధర్మశాల నిర్వహించనుండగా ముల్లాన్‌పూర్ (చండీగఢ్)లో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లకు ఆతిథ్యమివ్వనుంది. మే 24 దాకా లీగ్ మ్యాచ్‌లు జరుగాల్సి ఉండగా 26 నుంచి ప్లేఆఫ్స్ మొదలవుతాయి. 26న క్వాలిఫయర్-1, 27న ఎలిమినేటర్, 29న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరుగనుండగా ఈనెల 31న ఫైనల్‌ను నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా బీసీసీఐ నిర్ణయంపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది.