PV Sindhu | లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లి సత్తాచాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సింధు 21-12, 21-9తో భారత్‌కే చెందిన ఉన్నతి హుడాపై అలవోక విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన అనుభవాన్నంత ఉపయోగిస్తూ డ్రాప్షాట్లు, నెట్‌గేమ్‌తో ఆకట్టుకుంది. మరోవైపు ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఉన్నతి..ఒత్తిడికిలోనై అనవసరపు షాట్లతో ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. తొలి గేమ్‌లో సింధు 5-3తో ముందంజ వేసింది. పుంజుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఉన్నతి షాట్లను సరైన రీతిలో ఆడలేకపోయింది. దీంతో సీనియర్ షట్లర్ ఆధిక్యం 11-8కు చేరుకుంది. ఇదే అదనుగా విజృంభించిన సింధు..తన ట్రేడ్‌మార్క్ బేస్‌లైన్ స్మాషెస్ జోలికి పోకుండానే ఉన్నతి పనిపట్టింది. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన ఈ తెలుగు షట్లర్ వరుస పాయింట్లతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకు చెందిన యవు లు యుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ తర్వాత మాట్లాడుతూ ‘ ఈ రోజు నా ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నాను. ఆది నుంచే ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చాను. బేసిక్స్‌కు కట్టుబడి ఉంటూ మ్యాచ్ ఆడాను. మొత్తంగా ఈ విజయం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ప్లేయర్ల కెరీర్లో ఒడిదొడుకులు సహజం. వయసును బట్టి మనలో ఫిట్నెస్ స్థాయి మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లు మార్పులు చేసుకోవాలి’ అని అంది.
పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. శనివారం జరిగిన సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ 21-8, 21-14తో షోగో ఓగావ(జపాన్)పై గెలిచాడు. ఫైనల్లో జపాన్ షట్లర జియా హెంగ్జాసన్తో తలపడుతాడు. మిగతా మ్యాచ్‌ల్లో మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో ద్రువ్ కపిల, తనీషా క్యాస్ట్రో జోడీ 21-16, 21-15తో చైనా ద్వయం జౌ జీ, యాంగ్ జిపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొనప్ప, తనీషా క్యాస్ట్రో 21-14, 16-21, 13-21తో చైనా జంట బావో లీ జింగ్, లి క్విన్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ పృథ్వీ, సాయి ప్రతీక్ 21-17, 17-21, 21-16తో ఇషాన్ భట్నాగర్, శంకర్ ప్రసాద్‌పై గెలిచి టైటిల్ పోరులో నిలిచింది. మరో మహిళల డబుల్స్ సెమీస్‌లో గాయత్రీ గోపీచంద్, త్రిసా జాలీ జోడీ 18-21, 18-21, 10-21తో బెన్యప, నుత్కకరన్ ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.