ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవగా.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సమీర్ వర్మ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. శుక్రవారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 11-21, 12-21తో ఎనిమిదో ర్యాంకర్ అన్ సియాంగ్ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన తెలుగమ్మాయి వరుస గేమ్‌ల్లో ఓడింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన తర్వాత విరామం అనంతరం బరిలోకి దిగిన సింధు.. కొరియా అమ్మాయికి దీటుగా బదులివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ తన పోరాటాన్ని ముగించాడు. క్వార్టర్స్‌లో సమీర్ 17-21తో టామీ సుగియార్టో (ఇండోనేషియా) చేతిలో తొలి గేమ్ కోల్పోయాక గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు.