ఎండకాలం.. మండే ఎండలతోపాటు చల్లచల్లని పుచ్చకాయలూ మార్కెట్లోకి వస్తాయి. ఒంట్లో నీటిశాతం పెంచుకునేందుకు వీటిని చాలామంది తింటుంటారు. జ్యూస్‌లు, సలాడ్ల రూపంలో రోడ్లమీద కూడా అమ్ముతారు . అయినా, ఎప్పుడూ రొటీన్‌గా జ్యూస్, సలాడ్లేనా! కాస్త వెరైటీగా ట్రై చేద్దామా..
మాక్‌టెయిల్
కావలసిన పదార్థాలు:పుచ్చకాయ ముక్కలు: ఒక కప్పు (చిన్నవి), పుదీనా ఆకులు: పావు కప్పు, నిమ్మకాయ: ఒకటి, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్: అర కప్పు, సోడా: అరగ్లాసు
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో నిమ్మకాయను గుండ్రని ముక్కలుగా కోసి వేసుకోవాలి. అందులోనే పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులు, చక్కెర, వేసి బాగా మెదపాలి. ఒక గ్లాస్లో ఐస్‌క్యూబ్స్ వేసి సోడా పోసి పైనుంచి పుచ్చకాయ మిశ్రమాన్ని పోయాలి. వెరైటీ అండ్ టేస్టీ ‘పుచ్చకాయ మాక్‌టెయిల్’ సిద్ధం.
హల్వా
కావలసిన పదార్థాలు:పుచ్చకాయ ముక్కలు: రెండు కప్పులు, కార్న్ ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర: పావు కప్పు, ఉప్పు: చిటికెడు, డ్రై ఫ్రూట్స్: అర కప్పు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం:ముందుగా పుచ్చకాయ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టు కోవాలి. అందులో కార్న్‌ఫ్లోర్, చక్కెర, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మందపాటి కడాయిలో వేసి, పెద్ద మంటతో బాగా ఉడికించాలి. గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇంకా బాగా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో పరిచి చల్లారనివ్వాలి. దీనిని ముక్కలుగా కోసుకుంటే పుచ్చకాయ హల్వా రెడీ.
జామ్
కావలసిన పదార్థాలు:పుచ్చకాయ ప్యూరీ: రెండు కప్పులు, చక్కెర: అర కప్పు, నిమ్మరసం: ఒక టీస్పూన్, రోజ్ వాటర్: ఒక టీ స్పూన్
తయారీ విధానం:ముందుగా స్టవ్‌మీద మందపాటి గిన్నె పెట్టుకుని, వేడయ్యాక పుచ్చకాయ గుజ్జును వేసి సన్నని మంటమీద వేయించాలి. పచ్చి వాసన పోయాక చక్కెర, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బాగా కలుపుతూ మిశ్రమం చిక్కపడేంత వరకు కలిపితే సరి. రుచికరమైన పుచ్చకాయ జామ్ రెడీ. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో పెడితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.
దోశ
కావలసిన పదార్థాలు:బియ్యం: ఒక కప్పు, మెంతులు: అర టీస్పూన్, కొబ్బరి తురుము: పావు కప్పు, కడిగిన అటుకులు: పావు కప్పు, పుచ్చకాయ ముక్కలు (తెల్లని భాగం): ఒక కప్పు, ఉప్పు: తగినంత
తయారీ విధానం:ముందుగా బియ్యాన్ని కడిగి మెంతులు వేసి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. పుచ్చకాయ తెలుపు భాగం ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని నానిన బియ్యం, మెంతులు, కొబ్బరి తురుము, అటుకులు వేసి దోసెల పిండిలా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఐదు గంటలపాటు పక్కన పెట్టాలి. బాగా నానిన పిండిని, పెనం మీద దోసెల్లా వేసుకుంటే సరి.
చట్నీ
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ (తెల్లని భాగం): ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత, మినుపపప్పు: ఒక టీ స్పూన్, పోపు గింజలు: అర టీస్పూన్, కరివేపాకు: ఒక రెబ్బ, ఎండు మిర్చి: నాలుగు
తయారీ విధానం:ముందుగా స్టవ్‌మీద గిన్నె పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి మినుపపప్పు, ఎండు మిరపకాయలు వేసి, బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికిన మిశ్రమాన్ని దింపి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్‌మీద చిన్న గిన్నెపెట్టి కొంచెం నూనె వేసి వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు వేసుకుని ఈ మిశ్రమంలో కలుపుకుంటే సరి. నోరూరించే పుచ్చకాయ చట్నీ రెడీ. దీన్ని దోశ, ఇడ్లీల్లోకే కాక అన్నంలో కలుపుకొని తిన్నా బావుంటుంది.
టూటీ ఫ్రూటీ
కావలసిన పదార్థాలు:పుచ్చకాయ (తెల్లని భాగం): చిన్నగా తరిగిన ముక్కలు ఒక కప్పు, చక్కెర: అర కప్పు, ఫుడ్ కలర్స్ (రెడ్, యెల్లో, ఆరెంజ్): చిటికెడు చొప్పున, వెనిలా ఎసెన్స్: పావు టీస్పూన్
తయారీ విధానం:ముందుగా నీళ్ళు వేడి చేసుకోవాలి. ఆ నీటిలో చిన్నగా తరిగిన పుచ్చకాయ తెల్లటి భాగం ముక్కల్ని వేసి బాగా మరిగించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత తీసి వడ కట్టాలి. స్టవ్‌మీద మరో గిన్నెలో చక్కెర వేసి కొద్దిగా నీరు పోసి కరగనివ్వాలి. దగ్గరవుతున్న చక్కెరలో పుచ్చకాయ ముక్కల్ని, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలియబెట్టాలి. చక్కెరనంతా పీల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి, ముక్కలను మూడు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో భాగానికి ఒక్కో ఫుడ్ కలర్ కలిపి పక్కన పెట్టాలి. ముక్కలకు కలర్ బాగా పట్టిందనుకున్నాక, వాటిని తీసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత డబ్బాలో వేసి నిలువ చేసుకుంటే సరి. పుచ్చకాయ టూటీఫ్రూటీ రెడీ. ఎండ తగులకుండా పెడితే ఇవి ఆర్నెళ్ళ వరకు నిల్వుంటాయి.
ఇవే కాదు.. పుచ్చకాయ చికెన్, పుచ్చకాయ నిలువ పచ్చడి, పుచ్చకాయ పెప్పర్ సూప్.. వంటి ఎన్నో వంటకాలను ఆస్వాదించవచ్చు. ఇంటర్నెట్లో రెసిపీ సిద్ధంగా ఉంది.