భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌కు నిరాశ తప్పలేదు. జకార్తాలోని ఇస్తోరా వేదికగా జరిగిన ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్లోనే వీరిద్దరూ ఓటములు చవి చూశారు. మహిళల సింగిల్స్ విభాగంలో.. 7వ సీడ్ సింధు తన తొలి మ్యాచ్‌లోనే చైనాకు చెందిన హె బింగ్ జియావోతో పోటీ పడాల్సి వచ్చింది. 9వ సీడ్ అయిన ఈ ఎడమచేతి వాటం షట్లర్.. ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగింది. దాంతో సింధు తడబడింది.
మధ్యలో కొన్ని మంచి స్ట్రోక్స్ ఆడినప్పటికీ.. 14-21, 18-21తో వరుసగా రెండు సెట్లు ఓడిపోయింది. దీంతో కేవలం 47 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ ఓటమితో సింధు.. ఇండోనేషియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో 16వ సీడ్ సాయి ప్రణీత్ తన ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
పురుషుల సింగిల్స్ ఈవెంట్లో డెన్మార్క్ ఆటగాడు హాన్స్ క్రిస్టియన్ విట్టింగుస్ చేతిలో ప్రణీత్ ఓటమి చవి చూశాడు. 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 16-21, 19-21తో వరుస సెట్లు ఓడిన ప్రణీత్.. టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇలా తొలి రౌండ్లోనే ఇద్దరు భారత స్టార్ షట్లర్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో క్రీడాభిమానులు ఆశ్చర్యపోతున్నారు.