ధర్మశాల : నెలన్నర రోజులుగా సాఫీగా సాగుతున్న ఐపీఎల్-18లో భారీ కుదుపు! గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దెంది. స్టేడియంలోని ఫ్లడ్ లైట్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వర్షం కారణంగా సుమారు గంట పాటు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో 10.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య పంజాబ్.. 10.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (34 బంతుల్లో 70, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్, 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 122 రన్స్ జోడించారు.
ప్రియాన్ష్ నిష్క్రమించిన వెంటనే శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. అదే సమయంలో స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌లైట్లలో ఒక దాంట్లో అంతరాయం తలెత్తడంతో ఆటను నిలిపేశారు. కొద్దిసేపటికే ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లిపోగా మరో రెండు ఫ్లడ్ లైట్లూ ఆగిపోయాయి. అదే సమయంలో స్టేడియంలో ఉన్న భద్రతా సిబ్బంది మైదానంలో ఉన్న ప్రేక్షకులను హుటాహుటిన అక్కడ్నుంచి క్షేమంగా తరలించింది. మ్యాచ్ రైద్దెన తర్వాత బీసీసీఐ స్పందిస్తూ.. సాంకేతిక సమస్యలతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటిస్తూ ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్లో సాంకేతిక సమస్యలతో ఒక మ్యాచ్ రద్దవడం లీగ్ చరిత్రలో ఇదే ప్రథమం.
ఫ్లడ్‌లైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యతో మ్యాచ్‌ను రద్దు చేశామని బీసీసీఐ చెబుతున్నా.. గురువారం రాత్రి పాకిస్థాన్ చేసిన ప్రతిదాడులే ఇందుకు కారణమని సమాచారం. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’కు బదులు తీర్చుకుంటామని చెప్పిన పాక్.. గురువారం రాత్రి జమ్మూపై దాడులకు తెగబడటంతో సరిహద్దు జిల్లాల్లో విద్యుత్‌ను పూర్తిగా (బ్లాక్ ఔట్) నిలిపేశారు.
ఆట సగంలో ఉండగానే అప్పటికే జమ్మూపై పాక్.. డ్రోన్లు, ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. సరిహద్దులకు ఆనుకునే ఉండే ధర్మశాలలోనూ దాడులు జరిగే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు, మ్యాచ్ సిబ్బంది, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా వారిని అక్కడ్నుంచి యుద్ధప్రాతిపదికన తరలించారు. ఆటగాళ్లు, బ్రాడ్కాస్ట్, ఇతర సిబ్బందిని శుక్రవారం ధర్మశాల నుంచి ప్రత్యేక రైలులో తరలించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నది.