ముంబై: ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగించింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు టాపార్డర్ బ్యాటర్ల బాదుడుతో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్.. ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 నాటౌట్, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (35 బంతుల్లో 66, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఛేదనను ఆ జట్టు 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబైకి డికాక్ (60 బంతుల్లో 112 నాటౌట్, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ సీజన్లో తన ఆగమనాన్ని సెంచరీతో ఘనంగా చాటడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. నమన్ ధీర్ (31 బంతుల్లో 50, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) డికాక్‌కు అండగా నిలిచి అర్ధ శతకంతో రాణించాడు.
4, 4, 6, 4.. ఛేదనలో చాహర్ వేసిన తొలి ఓవర్లోనే పంజాబ్ ఓపెనర్ల జోరు అది. ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్, ‘సర్పంచ్ సాబ్’ శ్రేయాస్ దూకుడుతో కింగ్స్ మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. రెండు బౌండరీలు, ఓ సిక్స్‌తో జోరు చూపించిన ప్రియాన్ష్ (15)తో పాటు కనోలి (17)ను గజన్ఫర్ ఔట్ చేసినా అది పంజాబ్ ఛేదనపై ప్రభావం చూపలేకపోయింది. ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్, ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చాహర్, హార్ధిక్, శార్దూల్.. అందరూ అతడి బాదుడుకు బాధితులే. హార్ధిక్ పదో ఓవర్లో రెండు బౌండరీలతో కింగ్స్ స్కోరుబోర్డు వంద పరుగులు దాటింది.
ఆ తర్వాత శార్దూల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో సిక్స్‌తో జోరందుకున్న శ్రేయాస్.. ఈ సీజన్లో ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడుతున్న బుమ్రా బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్ మీదుగా చూడచక్కని సిక్స్ కొట్టాడు. అతడే వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లతో అయ్యర్ కూడా సీజన్లో వరుసగా మూడో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. శార్దూల్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన శ్రేయాస్, మూడో బంతికి నిష్క్రమించడంతో 66 బంతుల్లోనే 139 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే విజయం ఖాయమవగా.. స్టోయినిస్ (10*), ప్రభ్‌సిమ్రన్ మిగతా పని పూర్తిచేశారు.
అర్ష్‌దీప్ విసిరిన రెండో ఓవర్లో ఇచ్చిన డబుల్ షాకులతో 12/2గా నిలిచిన ముంబైని ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన డికాక్, మిడిలార్డర్లో నమన్ ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే శతాధిక (122) భాగస్వామ్యం నెలకొల్పి ఆతిథ్య జట్టుకు పోరాడగలిగే స్కోరునందించారు. రికెల్టన్ వికెట్‌తో ఐపీఎల్ కెరీర్లో వందో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న అర్ష్‌దీప్ రెండో బంతికి సూర్యను డకౌట్ చేశాడు.
ఈ దశలో డికాక్, ధీర్ పంజాబ్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి బౌండరీలు, సిక్స్‌లతో రెచ్చిపోయారు. డికాక్‌కు పూర్తి సహకారం అందించిన నమన్.. శశాంక్ ఓవర్లో లాంగాన్ మీదుగా సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించినా అదే ఓవర్లో లాంగాఫ్ వద్ద బార్ట్లెట్కు చిక్కడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శశాంక్ ఓవర్లో రెండు సిక్స్‌లతో 90లలోకి వచ్చిన డికాక్.. బార్ట్లెట్ బౌలింగ్‌లో బౌండరీతో ఈ లీగ్‌లో మూడో సెంచరీని నమోదుచేశాడు.

శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. యాన్సెన్ 18వ ఓవర్లో హార్దిక్ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడుపుగా పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో అంతే సమయస్ఫూర్తితో బంతిని మైదానంలోకి విసరడంతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న బార్ట్లెట్ క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
ముంబై: 20 ఓవర్లకు 195/6 (డికాక్ 112*, నమన్ 50, అర్ష్‌దీప్ 3/22, శశాంక్ 1/19);
పంజాబ్: 16.3 ఓవర్లకు 198/3 (ప్రభ్‌సిమ్రన్ 80*, శ్రేయాస్ 66, గజన్ఫర్ 2/31)
