ముల్లాన్‌పూర్: ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతున్నది. ఈ సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టైటిల్ సాధనే లక్ష్యంగా ఆడుతున్న ఆ జట్టు.. తమ ఆరో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం రాత్రి ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో కింగ్స్.. 54 రన్స్ తేడాతో పంత్ సేనపై గెలిచి ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసింది. తొలుత ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93, 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్ కనోలి (46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి సిక్సర్ల సునామీ సృష్టించడంతో కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగుల రికార్డు స్కోరు చేసింది. కొండంత లక్ష్య ఛేదనలో లక్నో.. 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 200 రన్స్ వద్దే ఆగిపోయింది. రిషభ్ పంత్ (23 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన లక్నోకు ఇది నాలుగో ఓటమి కాగా వరుసగా మూడో పరాభవం.
సిక్సర్ల సునామీ
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్, కూపర్ జోడీ ఆటదే హైలైట్. ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్‌ను తొలి ఓవర్లోనే షమీ డకౌట్ చేయడంతో జతకలిసిన ఈ యువ ద్వయం.. క్రీజులో ఉన్న 13 ఓవర్లలో లక్నో బౌలర్లకు పీడకలలను మిగిల్చే విధ్వంసాన్ని సృష్టించింది. బౌండరీతో పరుగుల వేట ప్రారంభించిన కూపర్, సిక్స్‌తో విధ్వంస రచనకు శ్రీకారం చుట్టిన ప్రియాన్ష్.. క్రీజులో ఉన్న 85 బంతుల్లో రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి కింగ్స్‌ను తిరుగులేని స్థితిలో నిలిపారు. తొలి ఐదు ఓవర్లలో కాస్త పద్ధతిగానే బాదిన ఈ జోడీ.. ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదుడుతో దూకుడు పెంచింది. 19 బంతుల్లో ఆర్య, 34 బంతుల్లో కూపర్ అర్ధ శతకాలు పూర్తిచేసుకోవడంతో 11 ఓవర్లకే పంజాబ్ స్కోరు 129/1తో నిలిచింది. మొదటి 19 బంతుల్లో 22 పరుగులే చేసిన కూపర్.. తర్వాత 13 బంతుల్లోనే 35 రన్స్ రాబట్టాడు. అవేశ్ 12వ ఓవర్లో ఆర్య రెండు సిక్స్‌లు కొట్టగా మార్క్మ్ ఓవర్లో అయితే విధ్వంసం తారాస్థాయికి చేరింది.
కూపర్ మూడు, ఆర్య మరో రెండు సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపడంతో ఆ ఓవర్లో ఏకంగా 32 పరుగులొచ్చాయి. 13 ఓవర్లకే పంజాబ్ స్కోరు 180 మార్కును అందుకోవడంతో ఆ జట్టు సన్‌రైజర్స్ రికార్డు స్కోరు (287)ను బ్రేక్ చేస్తుందా? అనిపించింది. కానీ ప్రిన్స్ 14వ ఓవర్లో కూపర్‌ను ఔట్ చేసి లక్నోకు ఉపశమనాన్ని అందించగా సిద్ధార్థ్ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన ఆర్య.. బౌండరీ లైన్ వద్ద మార్ష్ క్యాచ్ పట్టడంతో సెంచరీని తృటిలో కోల్పోయాడు. శ్రేయాస్ (5), నేహాల్ (13) నిరాశపరిచినా ఆఖర్లో స్టోయినిస్ (29), శశాంక్ (17) మెరుపులతో కింగ్స్ ఈ లీగ్‌లో తమ రెండో అత్యుత్తమ స్కోరును నమోదుచేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఇదే హయ్యస్ట్ స్కోరు. మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు 21 సిక్స్‌లు బాదితే అందులో ఆర్య, కూపర్ 16 సిక్స్‌లు కొట్టడం విశేషం.
లక్నో పోరాడినా..
ఛేదనను లక్నో సైతం వేగంగానే ఆరంభించినా ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో పాటు అవసరమైన సమయంలో విజృంభించలేక అపజయాన్ని మూటగట్టుకుంది. పవర్ ప్లేలో ఓపెనర్లు మార్ష్, బదోని (35).. 61 రన్స్‌తో మంచి ఆరంభమే ఇచ్చారు. ఐదు బౌండరీలు, సిక్స్ కొట్టిన బదోనిని ఔట్ చేసిన వైశాక్.. లక్నోకు తొలి షాక్ ఇచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన పంత్‌తో మార్ష్ జతకలిసినా ఈ జోడీ ఆశించిన స్థాయిలో బాదలేకపోయింది. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది.11 ఓవర్ల దాకా క్రీజులో ఉండి 28 బంతులాడిన మార్ష్‌ను చాహల్ పెవిలియన్‌కు పంపడంతో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ ఓవర్లో రెండు సిక్స్‌లతో గేర్ మార్చిన పంత్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. లక్నో భారీగా ఆశలు పెట్టుకున్న పూరన్ (9)ను యాన్సెన్ 15వ ఓవర్లో వెనక్కి పంపాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 113 పరుగులు అవసరమైన దశలో 58 రన్స్ మాత్రమే చేసింది. మార్క్రమ్, ముకుల్ వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నా వారు బ్యాట్ ఝుళిపించలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 254/7 (ప్రియాన్ష్ 93, కూపర్ 87, ప్రిన్స్ 2/25, సిద్ధార్థ్ 2/35); లక్నో: 20 ఓవర్లకు 200/5 (పంత్ 43, మార్క్మ్ 42, యాన్సెన్ 2/37, వైశాక్ 1/30)