లక్నో: తొలి ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి తర్వాత వరుసగా ఆరు పరాజయాలతో అనూహ్యంగా డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) ఐపీఎల్లో తొలి శతకంతో విజృంభించడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్, కోల్‌కతా ఓడిపోతే కింగ్స్ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరుకోనుంది. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన ఈ పోరులో అయ్యర్ అసాధారణ ఆటతో లక్నో ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ (69) కూడా రాణించాడు. తొలుత లక్నో 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72), ఆయుష్ బదోని (18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) సత్తా చాటగా.. యాన్సెన్, చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రాణించిన ఇంగ్లిస్, బదోని
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయినా ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే ఇంగ్లిస్ నాలుగు ఫోర్లతో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. కానీ, అరంగేట్ర ఆటగాడు అర్షిణ్ కులకర్ణి(0) .. ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ పూరన్(2) తన పేలవ ఫామ్‌ను కొనసాగించడంతో లక్నో 20/2తో డీలా పడింది. ఈ దశలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన బదోని..ఆ ఇంగ్లిస్‌కు జతకలిసి భారీ షాట్లు కొట్టాడు. యాన్సెన్ లక్ష్యంగా ఐదో ఓవర్లో 4,4, 6,4.. అదే ఊపులో అజ్మతుల్లా బౌలింగ్‌లో 4,6,6,4 బాదడంతో పవర్‌ప్లేలో లక్నో 66 పరుగులు చేసింది. అయితే జోరుమీదున్న బదోనిని స్పిన్నర్ చహల్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 49 పరుగులకు బ్రేక్ పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ పంత్ (26)తో కలిసి ఇంగ్లిస్ పోరాటం కొనసాగించాడు. మరోమారు అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ 6,4,4తోఫిఫ్టీ పూర్తి చేశాడు. పంత్, ఇంగ్లిస్ వెంటవెంటనే ఔటైనా.. ఆఖర్లో సమద్(37 నాటౌట్) భారీ షాట్లతో విజృంభించడంతో లక్నో మంచి స్కోరు చేసింది.
అయ్యర్ అదుర్స్
భారీ లక్ష్యఛేదనలో పంజాబ్‌కు తొలి బాల్కే షాక్ తగిలింది. షమీ బౌలింగ్‌లో పుల్‌షాట్ ఆడే ప్రయత్నంలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(0).. అర్జున్ టెండూల్కర్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు.వన్‌డౌన్‌లో వచ్చిన కూర్ కనోలి(18) వరుస బౌండరీలతో దూకుడు కనబరిచాడు. కానీ, షమీ తన స్వింగ్ డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేయడంతో పంజాబ్ 22/2తో డీలా పడింది. ఈ తరుణంలో ఇన్నింగ్స్ బాధ్యతను ప్రభ్‌సిమ్రన్, కెప్టెన్ అయ్యర్ భుజానేసుకున్నారు. ఇద్దరు క్రమం తప్పకుండా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 65/2తో పుంజుకుంది. తొలుత జాగ్రత్తగా ఆడిన ఈ ఇద్దరు ఆ తర్వాత రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకుంటూ జోరు పెంచారు. అర్జున్ వేసిన 9వ ఓవర్లో అయ్యర్ ఫోర్కు తోడు ప్రభ్‌సిమ్రన్ 4, 6తో 15 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి ఇద్దరు పోటీపడుతూ ఫోర్లూ, సిక్సర్లు కొట్టడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో అర్జున్ వేసిన ఇన్స్విగ్ యార్కర్‌కు ప్రభ్‌సిమ్రన్ వికెట్ల ముందు దొరికిపోవడంతో మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ప్రభ్ ఔటైనా..అయ్యర్ దూకుడు తగ్గించలేదు. షమీ 16వ ఓవర్లో మూడు భారీ సిక్స్‌లు బాదడంతో పంజాబ్ గెలుపు సమీకరణం కాస్తా 24 బంతుల్లో 15కు చేరుకుంది. మోసిన్ బౌలింగ్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టిన అయ్యర్ సెంచరీ కూడా పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 196/6(ఇంగ్లిస్ 72, బదోని 43, చహల్ 2/25).
పంజాబ్: 18 ఓవర్లలో 200/3 (శ్రేయస్ 101*, ప్రభ్‌సిమ్రన్ 69, షమీ 2/45)