ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అజేయ అర్ధసెంచరీతో చెలరేగిన వేళ పంజాబ్ భారీ స్కోరు అందుకుంది. గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ అయ్యర్ వీరవిహారం చేశాడు. లక్ష్యఛేదనలో సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్ పోరాడినా..ఇంప్యాక్ట్ ప్లేయర్ విజయ్‌కుమార్ రంగప్రవేశంతో మ్యాచ్ పంజాబ్ దిక్కు మొగ్గింది.
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ల హవా కొనసాగుతున్నది. లక్నోపై ఢిల్లీ యంగ్ గన్ అశుతోష్ అసాధారణ ఇన్నింగ్స్ మరిచిపోక ముందే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఇంప్యాక్ట్ విజయ్‌కుమార్ సూపర్ బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకమయ్యాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. తొలుత శ్రేయాస్ అయ్యర్(42 బంతుల్లో 97 నాటౌట్, 5ఫోర్లు, 9సిక్స్‌లు), ప్రియాంశ్(47) రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది. సాయికిషోర్(3/30) ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 232/5 స్కోరు చేసింది. సుదర్శన్(41 బంతుల్లో 74, 5ఫోర్లు, 6సిక్స్‌లు), బట్లర్(54), రూథర్‌ఫర్డ్(46) సాధికారిక ఇన్నింగ్స్ ఆడారు. అర్ష్‌దీప్‌సింగ్(2/36)రెండు వికెట్లు తీయగా, విజయ్‌కుమార్(3-0-28-0)..గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. శ్రేయాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
కొండంత లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు శుభారంభమే దక్కింది. తొలి వికెట్‌కు సుదర్శన్, గిల్ (14 బంతుల్లో 33, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జోడీ 6 ఓవర్లలో 61 పరుగులు జోడించింది. మొదటి మూడు ఓవర్లలో వికెట్‌ను కాపాడుకునే క్రమంలో షాట్ల జోలికి పోని ఈ ఇద్దరూ.. నాలుగో ఓవర్ నుంచి గేర్ మార్చారు. అజ్మతుల్లా నాలుగో ఓవర్లో గిల్.. డీప్ మిడ్ వికెట్, బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్ దిశగా రెండు సిక్సర్లు కొట్టాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన మ్యాక్స్‌వెల్.. గిల్‌ను ఔట్ చేసి పంజాబ్‌కు తొలి బ్రేక్‌నిచ్చాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సుదర్శన్.. ఛేదించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండటంతో బ్యాట్‌కు పనిచెప్పాడు.
కానీ అర్ష్‌దీప్ రెండో స్పెల్‌లో సుదర్శన్.. బౌండరీ లైన్ వద్ద శశాంక్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. చివరి 4 ఓవర్లలో గుజరాత్ విజయానికి 62 పరుగులు అవసరమవగా..జాన్సెన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్..గుజరాత్‌ను అద్భుతంగా నిలువరించారు. జాన్సెన్ 18వ ఓవర్లో ఆఖరి బంతికి బట్లర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత విజయ్‌కుమార్ బౌలింగ్‌లో రూథర్‌ఫర్డ్ రెండు ఫోర్లు, తెవాటియా సిక్స్‌తో సమీకరణం కాస్తా 6 బంతుల్లో 27కు చేరింది. చివరి ఓవర్‌కు దిగిన అర్ష్‌దీప్..తెవాటియాతో పాటు రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసి జట్టును గెలిపించాడు.
ఈ సీజన్లో పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగిన పంజాబ్.. పేరుకు తగ్గట్టే బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ‘కింగ్స్’ ఇన్నింగ్స్‌లో కొత్త కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య మెరుపు ఆరంభాన్నిస్తే.. మిడిల్ ఓవర్స్‌లో శ్రేయస్ దానిని కొనసాగించగా ఆఖర్లో శశాంక్ బాదుడును నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లడంతో ఈ లీగ్‌లో పంజాబ్ రెండో అత్యధిక స్కోరును నమోదుచేసింది.
సిరాజ్ తొలి ఓవర్లో రెండో బంతినే బౌండరీగా మలిచిన ఆర్య.. అతడే వేసిన మూడో ఓవర్లో ఆఖరి రెండు బంతులనూ భారీ సిక్సర్లుగా మలిచాడు. అర్షద్ ఖాన్ 5వ ఓవర్లో అయితే 4, 4, 6, 4తో ఈ ఢిల్లీ కుర్రాడు 21 పరుగులు పిండుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ (5) నాలుగో ఓవర్లోనే నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్.. 4 ,6తో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. 7వ ఓవర్లో రషీద్.. ఆర్యను ఔట్ చే అజ్మతుల్లా (16) నిరాశపరచగా, మ్యా డకౌట్ అయ్యాడు. స్టోయినిస్ (20) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 166/5గానే ఉంది. ఆ జట్టు స్కోరు 200 దాటుతుందని అంతా భావించినా శ్రేయస్, శశాంక్ కలిసి విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి 24 బంతుల్లోనే 77 పరుగులు చేశారు. భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్న అయ్యర్.. ప్రసిధ్ 17వ ఓవర్లో 6, 4, 6, 6తో 24 పరుగులు రాబట్టి 90లలోకి చేరాడు. ఆఖరి ఓవర్లో శ్రేయస్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా క్రీజులో ఉన్న శశాంక్ 23 పరుగులతో పంజాబ్‌కు ఘనమైన ముగింపునిచ్చాడు. 2 పంజాబ్‌కు ఈ లీగ్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. గత సీజన్లో ఆ జట్టు కోల్‌కతాపై 262/2 చేసింది.
పంజాబ్: 20 ఓవర్లలో 243/5 (శ్రేయస్ 97 నాటౌట్, ప్రియాన్ష్ 47, సాయికిషోర్ 3/30, రబాడా 1/41),
గుజరాత్: 20 ఓవర్లలో 232/5(సుదర్శన్ 74, బట్లర్ 54, అర్ష్‌దీప్‌సింగ్ 2/36, మ్యాక్స్‌వెల్ 1/26)