సిద్దిపేట,ఆగస్టు 29: క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువుపై గల నెక్లెస్ రోడ్డులో సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్, టీజీపీటీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడుతాయన్నారు.
సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దీంట్లో భాగంగా గ్రామానికో క్రీడా మైదానం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థానాల్లో రాణిస్తున్న క్రీడాకారులు, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, పాల సాయిరాం, విజిత వేణుగోపాల్‌రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.