ఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 23 దాకా (లీగ్ దశ) జరుగబోయే ఈ మెగా ఈవెంట్ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో అభిమానులకు కబడ్డీ మజాను అందించనుంది. ఈ మేరకు పీకేఎల్ నిర్వాహకులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది. ఏడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీకి వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది.
వైజాగ్‌లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు, జైపూర్‌లో సెప్టెంబర్ 12 నుంచి 28 దాకా, చెన్నైలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరుగనున్న ఈ టోర్నీ.. ఢిల్లీలో అక్టోబర్ 13 నుంచి 23 దాకా జరుగుతుంది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నారు. ఇక ఆగస్టు 29న తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్‌తో టోర్నీ అధికారికంగా ప్రారంభమవనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ హర్యానా స్టీలర్స్.. ఆగస్టు 31న బెంగాల్ వారియర్స్ మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనున్నారు.