ముంబై: దేశవాళీ రంజీ దిగ్గజం ముంబై జట్టుకు స్టార్ క్రికెటర్ పృథ్వీషా గుడ్‌బై చెప్పాడు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో పాటు అనవసర వివాదాలతో వార్తల్లోకెక్కిన షా.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ముంబై జట్టును వీడాడు. రానున్న దేశవాళీ సీజన్లో కొత్త జట్టుకు ఆడేందుకు సిద్ధమైన ఈ 25 ఏండ్ల యువ క్రికెటర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) కోసం తాజాగా దరఖాస్తు చేసుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అందుకు అంగీకారం తెలిపింది. ఎంసీఏ సెక్రటరీ అభయ్ స్పందిస్తూ.. ‘షా అద్భుత నైపుణ్యం గల క్రికెటర్. మేం అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.
భవిష్యత్‌లో అతడు మరింత విజయవంతమవ్వాలి’ అని తెలిపాడు. ఈ క్రమంలో షా.. ఎమ్‌సీఏకు రాసిన లేఖలో స్పందిస్తూ ‘ఇన్నాళ్లు ముంబైకి ఆడటం చాలా గర్వంగా ఉంది. దిగ్గజ క్రికెటర్లతో ఆడుతూ ఎంతో అనుభవం గడించాను. కెరీర్లో కీలకమైన తరుణంలో మరో స్టేట్ అసోసియేషన్‌కు ఆడబోతున్నాను. ఇది నా కెరీర్ ఎదుగుదలకు దోహదం చేస్తుందన్న నమ్మకముంది’ అని పేర్కొన్నాడు. పృథ్వీ వచ్చే సీజన్ నుంచి మహారాష్ట్రకు ఆడనున్నట్టు సమాచారం.