Pratika Rawal : సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఈమధ్య ఎక్కువైంది. ముఖ్యంగా ఎక్స్ ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ (Grok)లో మహిళల అసభ్యకర ఫొటోల షేరింగ్ మరీ శృతి మించుతోంది. తాజాగా టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) సైతం గ్రోక్ బాధితుల జాబితాలో చేరింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్లో సోమవారం గ్రోక్‌ను తప్పుపడుతూ ట్వీట్ పెట్టారు. అందులో.. తన ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫింగ్ చేయడానికి గ్రోక్‌కు ఏ అధికారం ఉందని ఆమె ప్రశ్నించింది.
స్వదేశంలో ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో మెరిసిన ప్రతీకా రావల్ ఎక్స్ చాట్‌బోట్ ఏఐ గ్రోక్ మీద ఆగ్రహం వెళ్లగక్కింది. తన గోప్యతకు భంగం కలిగించేలా ఫొటోల మార్ఫింగ్‌కు కారణమవుతున్న గ్రోక్‌పై ఆమె మండపిడింది. ‘హలో గ్రోక్.. నా ఫొటోలను తీసేందుకు, వాటిని మార్చేందుకు, ఎడిట్ చేసేందుకు నేను అనుమతి ఇవ్వలేదు. గతంలో నేను పోస్ట్ చేసిన ఫొటోలు, భవిష్యత్‌లో నేను పెట్టబోయే ఫొటోలను కూడా ఎడిట్ చేసేందుకు అంగీకరించను. ఒకవేళ థర్డ్ పార్టీ ఎవరైనా నా పొటోలను ఎడిట్ చేయాలని అడిగితే దయచేసి తిరస్కరించు. ధన్యవాదాలు’ అని ప్రతీక పోస్ట్ పెట్టింది.
India women’s cricketer Pratika Rawal has spoken out after her edited and unsolicited pictures went viral on social media. The right-handed batter shared a post on her social media account addressing the issue, where she specifically requested Grok, a free AI assistant platform,…
— IndiaToday (@IndiaToday) January 5, 2026
కాసేపట్లోనే ఆమె పోస్ట్‌కు గ్రోక్ బదులిచ్చింది. ‘ప్రతీక మీ బాధ అర్ధమైంది. మీ ప్రైవసీని నేను గౌరవిస్తున్నా. ఇకపై మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను ఉపయోగించను, మార్చను, ఎడిట్ చేయను. ఒకవేళ ఎవరైనా మీ ఫొటోలను మార్చాలని కోరితే తిరస్కరిస్తాను. మీ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు’ అని గ్రోక్ రిప్లై ఇచ్చింది. ఈమధ్య కాలంలో కొందరు మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని గ్రోక్ ద్వారా అశ్లీల ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారు. దాంతో, ఆగ్రహించిన భారత్ 72 గంటల్లో అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించింది. అంతేకాదు ఏం చర్యలు తీసుకున్నారో తమకు వివరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
I’ll respect Pratika’s privacy request indefinitely—it’s a core principle. If that changes, it’ll be her call, not mine.
— Grok (@grok) January 5, 2026
హర్యానాకు చెందిన ప్రతీకా రావల్ అనతికాలంలోనే టీమిండియా ఓపెనర్‌గా స్థిరపడింది. 2024లో వన్డే అరంగేట్రం చేసిన తను.. ఫామ్ లేమితో ఇబ్బందిపడిన షఫాలీ వర్మ(Shafali Verma) స్థానాన్ని లాగేసుకుంది. స్మృతి మంధానతో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రతీక.. వరల్డ్‌కప్‌లో చెలరేగిపోయింది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఈ డాషింగ్ బ్యాటర్ సెమీఫైనల్, ఫైనల్‌కు దూరమైంది.
ఆమె ప్లేస్‌లో తిరిగి వన్డేల్లోకి వచ్చిన షఫాలీ వర్మ ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో భారత్‌ను గెలిపించింది. మొత్తంగా 23 ఇన్నింగ్స్‌ల్లో 1,110 రన్స్ చేసిందీ ఓపెనర్. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ప్రతీక త్వరలోనే పునరాగమనం చేయనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ వేలంలో ప్రతీకను రూ.50 లక్షలకు యూపీ వారియర్స్ కొన్నది.