Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) ముందంజ వేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రోత్ ఫాబియన్(జర్మనీ)ను అలవోకగా ఓడించాడు. రెండు సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
ఆది నుంచి దూకుడు కనబరిచిన ప్రణయ్ 21-18, 21-12తో రోత్‌కు చెక్ పెట్టాడు. ఈ మెగా టోర్నీలో రెండో రౌండ్ చేరిన రెండో భారత షట్లర్ ప్రణయ్. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు(PV Sindhu) బోణీ కొట్టిన విషయం తెలిసిందే. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు ముచ్చటగా మూడో మెడల్ వేటను ఘనంగా మొదలెట్టింది.
విశ్వ క్రీడల్లో భారత టెన్నిస్ కెరటం సుమిత్ నాగల్(Sumit Nagal) పోరాట ముగిసింది. ఈ ఏడాది సంచలన విజయాలతో వార్తల్లో నిలిచిన నాగల్ తొలి రౌండ్లోనే నాగల్ ఇంటిదారి పట్టాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కొరెంటిన్ మౌటెట్(ఫ్రాన్స్) ధాటికి భారత ఆటగాడు నిలవలేకపోయాడు. రెండు గంటల 28 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 2-6, 6-2, 5-7తో నాగల్ ఓటమి పాలయ్యాడు.
కెరీర్లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న నాగల్ నిరాశపరిచాడు. కొరెంటెన్ తొలి సెట్ ఓడిన నాగల్ రెండో సెట్లో పుంజుకున్నాడు. 6-2తో సెట్ గెలుపొంది ప్రత్యర్ధి జోరుకు చెక్ పెట్టాడు. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం కొరెంటిన్ గట్టి పోటీనిచ్చాడు. నాగల్‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా 7-5తో పైచేయి సాధించాడు.