ఆర్కేపురం : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బోనాల ఉత్సవాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka ) అన్నారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల (Bonalu) ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని భక్తుల కోసం మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ఆలయ సిబ్బంది మంత్రికి దేవాలయ విశిష్టత గురించి వివరించారు.
ఖిల్లా మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి( MLA Sabitha Reddy) హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదం అందజేశారు.
అనంతరం రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధి చేశారని చెప్పారు.