కుమమోటొ : జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ గురువారం రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చౌటీన్ చెన్ చేతిలో ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ తరువాత తడబడడంతో ప్రత్యర్థి వరుస గేమ్‌లు గెలుచుకుని ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్12 చెన్ చేతిలో ప్రణయ్ 21-19, 16-21, 19-21 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌లో 4-0, 11-8తో ఆధిక్యంలో నిలిచి ప్రణయ్ సత్తాచాటాడు. చెన్ ఒత్తిడి పెంచినా ప్రణయ్ ఏమాత్రం తడబడక తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో గేమ్‌నుంచి స్పీడ్ పెంచిన చెన్ స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకుంటూ, ప్రణయ్‌కు ఏమాత్రం అవకాశమివ్వక మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.