సిడ్నీ: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం ప్రణయ్ 21-18, 21-12తో భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌పై విజయం సాధించాడు. వరుస గేమ్‌ల్లో విజృంభించిన ప్రణయ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఫలితం సంతృప్తినిచ్చింది. వరుసగా టాప్-10 ప్లేయర్లతో ఆడటం చాలా కష్టమైన పని. మలేషియా ఓపెన్ మాదిరే ఇక్కడ కూడా టైటిల్ గెలువాలనుకుంటున్నా’ అని అన్నాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్లో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడనున్నాడు. ఇటీవల మలేషియా మాస్టర్స్ ఫైనల్లో వెంగ్ను చిత్తుచేసిన ప్రణయ్ ఆరేండ్ల తర్వాత తొలి వ్యక్తిగత టైటిల్ సాధించిన విషయం తెలిసిందే.